5, జనవరి 2020, ఆదివారం

మధుర రామాయణము: అయోధ్యా కాండము - 91వ సర్గము

మధుర రామాయణము
అయోధ్యా కాండము - 91వ సర్గము

సంబంధిత చిత్రం

(సైన్యసమేతుఁడగు భరతునకు భరద్వాజుఁ డాతిథ్యమిచ్చుట)

ఆ భరద్వాజుఁ డప్పుడు నట వసింప
నిశ్చయముఁ గొన్న భరతుని “నే నొసఁగెడు
నట్టి యాతిథ్యమునుఁ గొనం దగును నీకు!”
నని నిమంత్రణమునుఁ జేసె నాదరమున! 2-91-1

భరతుఁడును సెప్పె నా భరద్వాజుతోడ
“నార్య! పాద్య మర్ఘ్యము నరణ్యమునఁ దనర
నమరునట్టి యీ యాతిథ్య మపుడె నాకు
నిచ్చియే యుంటివి గద దీవించియు నను!” 2-91-2

అంత నా భరద్వాజుండు హసితుఁడగుచు
భరతుతో నిట్టులనె నప్డు “వత్స! నీవు
ప్రీతి సంయుక్తుఁడవని తెలియుదు నేను!
పరఁగ నెది యిచ్చినం దృప్తిపడెద వీవు! 2-91-3

మనుజశార్దూల! నీ సైన్యమునకు నేను
భోజనముఁ బెట్ట నిప్పుడు ముచ్చటపడు
చుంటి! నా తృప్తి కొఱ కీవ యురుతరమగు
నాదు సత్కృతి నందగం దగును వత్స! 2-91-4

నృపవరా! యేల నీదు సైనికుల దూర
ముగ నునిచి యిటు వచ్చితి? వగణితమగు
నీదు సైన్యమ్ముతోఁ గూడి నాదు పర్ణ
శాల కెందుకు రావైతి సారమతిని?” 2-91-5

అనఁగ భరతుండు కేల్మోడ్చి యంజలించి,
యా భరద్వాజునిం గూర్చి యనెను “పూజ్య!
మాన్యులౌ మీ భయముచేత సైన్యములనుఁ
గూడి రానైతి నిచటకుఁ గోరి కోరి! 2-91-6

పూజ్య! నృపుఁడుఁ గాని, నృపుని పుత్రులైనఁ
గాని, సతతమ్ము దేశానఁ గడఁగి తాము,
ముని జనమ్ములకును దూరముగఁ జరింప
వలయుఁ గాన, నందుల కిట్టి పని కెరఁగితి! 2-91-7

ఉత్తమాశ్వమ్ములును, నరు, లుత్తమ మద
గజము లీ విశాల భువి నాక్రమణముఁ గొని,
పొంగిపొరలు కల్పాంత సముద్ర గతిని,
వచ్చుచుండెను నా వెన్క వడివడిగను! 2-91-8

అట్టి సైన్యమ్ము లాశ్రమా లందలి కుజ
సరసి వసు ధోటజముల నాశమ్ముఁ జేయు
ననెడి భయముచే, నట్టుల నావహిల్ల
కుంట కేను నొంటిగ వచ్చియుంటి నిటకు!” 2-91-9

అనిన భరతుని వాక్కుల నన్ని వినిన
ఋషియ, “సైన్యమ్ము నంతయు నిటకుఁ దె” మ్మ
టంచు భరతున కిచ్చియు నానతిఁ ద్వర,
నట్లె సైన్యమున్ రప్పించె నతి ముదమున! 2-91-10

అంత నా భరద్వాజుండు నగ్నిగృహము
నం బ్రవేశించి, యాచమనమ్ము సేసి,
యటులె పరిమార్జన మొనర్చి యాతిథేయ
మొసఁగ విశ్వకర్మను బిల్చె నుఱిదిగాను! 2-91-11

“ఆతిథేయ మ్మొసంగు మహర్షి నయిన
యే, గృహాదుల నిర్మించు హితుఁడు విశ్వ
కర్మ కాహ్వాన మిడుచుంటి! ధర్మముగ న
తం డిటకు వచ్చి, చేయుతం దగు విధృతిని! 2-91-12

బలభి దాదిగాఁ గల యమ వరుణ ధనదు
లనెడి లోకపాలుర మువ్వుర నిట కిప్పు
డామతించుచు నుంటిని! నాతిథేయ
మిడఁగ నియమనములను సేయింత్రు గాక! 2-91-13

భూమి పైనను, నాకాశముననుఁ, దూర్పు
దెసకు మఱియునుఁ బడమటి దెసకుఁ బాఱు
నదులు నదము లన్నియు నిప్డు నాల్గు దెసల
నుండి యేతెంచుఁగాక సన్నుతముగాను! 2-91-14

కొన్ని నదులు మైరేయమ్ముఁ, గొన్ని నదులు
సుకరమగు సుర, నిఁకఁ గొన్ని శుషిర లిక్షు
రసము వలె మధురపు శీతల జలములను
తొరఁగఁజేయునుఁ గావుత విరివిగాను! 2-91-15

దేవ గంధర్వులైన విశ్వావసులను,
హాహ హూహూల నట్టులే యమర జాతిఁ
బరఁగు దేవి, గంధర్వి, యప్సరసల నిట
కేఁగుఁదెంచ నాహ్వానింతు హితము నొసఁగ! 2-91-16

అలర మిశ్రకేశి, ఘృతాచి, కా యలంబు
సకును, నాగదత్తకును, విశ్వాచి, హేమ
లనెడి యప్సరస్త్రీలకు, నద్రిపయిని
నుండు హిమకు నే నిప్పు డాహూతి నిడుదు! 2-91-17

శక్రు సేవించునట్టి యచ్చర నెలఁతల,
నా యజునిఁ గొలిచెడునట్టి యంగనలను,
నుపకరణములున్నట్టి యా యువతులంద
ఱ నిటుఁ బిల్చుచుంటిని తుంబుర సహితముగ! 2-91-18

శాశ్వతమగు వస్త్రములు భూషణము లనెడి
పత్రములతోడ, నుత్తమ భామ లనెడి
పండ్లతోడఁ బ్రకాశించు పైఁడిఱేని
దివ్యకురువన మిచటఁ బ్రాప్తించుఁగాక! 2-91-19

నాకసదుఁడైన చంద్రుండు నా కొఱ కిట
నుత్తమాన్నమ్ము, బహురుచ్యయుక్త భక్ష్య
భోజ్యచోష్యలేహ్యములను ముదముతోడఁ
గల్పనము సేయుఁ గావుత ఘనత వెలయ! 2-91-20

అటులె, చెట్ల నుండియుఁ దగ నపుడె రాలి
నట్టి చిత్రమౌ విరిమాల, లాసవాది
పేయముల, బహువిధములౌ పిశితములనుఁ
గూడ కల్పించుఁ గావుత గురుతరముగ!" 2-91-21

అనుచు నేకాగ్రచిత్తుఁడై యమరి, శిక్ష
లోని స్వరములఁ బాటింప లీనుఁడయ్యుఁ,
బ్రతియె లేని తేజస్సు తపస్సు గలుగు
నా భరద్వాజుఁడు పలికె నప్పు డచట! 2-91-22

అంత నా భరద్వాజుఁడే యైంద్రి దిశకుఁ
దిరిగి, చేతులు జోడించి, పరఁగ ధ్యాన
ముద్రలోనుండఁగానె సంబోధితులగు
నమరులందఱొక్కొకరుగా నట కరిగిరి! 2-91-23

అంత గాలి దర్దుర మలయాద్రులంటి,
వచ్చుచు శరీరములకును స్పర్శసుఖపు
సంతసమ్ము నందించుచు, శ్రమజలముల
నెడపి, శుభకరముగఁ దాను సుడిసె ససిగ! 2-91-24

ఇంతలో దివ్యమైన మేఘేంద్రము లట
కేఁగుదెంచియు సుమవృష్టి యెసఁగఁగఁ గుఱి
పింప, దివ్య దుందుభులు శబ్దింప, నవియు
నన్ని దిక్కుల యందు వినంగఁబడెను! 2-91-25

అపుడు వాయువుల్వీచెను హాయిఁ గొలుప;
నప్సరస్త్రీగణములాడె నంద మెసఁగ;
నమరగంధర్వు లిడిరి గీతామృతమును;
వీణియలు మ్రోసె స్వరములఁ బెక్కుగతుల! 2-91-26

లయసమన్వితమును, సుందరమును, సమము
నైన వీణాది తద్ధ్వను లాకసమును,
భూమినిం, బ్రాణి కర్ణాల బోరనఁ జని,
చొచ్చెఁ బులకల మొలకలు నచ్చుపడఁగ! 2-91-27

మానవశ్రోత్రపేయమౌ మంగళనిన
దమ్ము శాంతినిఁ బొందిన తదుపరి యటఁ
గైక కొమరుని సైన్యమ్ము క్రమముగాను
విశ్వకర్మ యొనర్చిన పెరిమెఁ గనెను! 2-91-28

అచటఁ బంచయోజనపరివ్యాప్తమైన
యిలయు సమమయ్యు, నంతట నింద్రనీల
మణులు, వైడూర్యములు వలె మలయుచున్న
లేఁత పచ్చిక బయళులు ప్రియముఁ గొలిపె! 2-91-29

ఆ ప్రదేశమ్మునందున నతులిత ఫల
భరిత బిల్వ కపిత్థముల్, పనస బీజ
పూర కామలకీ సహకారవృక్ష
షండ మావిర్భవించెఁ బ్రశస్తముగను! 2-91-30

ఉత్తర కురు దేశమునుండి, యొప్పిదమగు
భోగ్యవస్తూపవనము; త్రిపుటమునందుఁ
బెక్కు పాదపములతోడఁ బిక్కటిలిన
దివ్య నిర్ఝరి యటకుఁ బ్రాప్తించె నపుడు! 2-91-31

శుభ్ర సచ్చతుశ్శాలలు, శుండ్యగార,
హయ నిలయములు, ప్రాసాద హర్మ్య యుక్త
మౌ, శుభంకర తోరణ హార ఘటిత
మైన ద్వారమ్ము లుదయించె నట్టి తఱిని! 2-91-32

శుభ్రమేఘ సదృశమును, సుందరతర
తోరణకృతము, సితపుష్పహారమండి
తమును, దివ్యగంధార్ద్రయుతమును నయిన
దివ్య రాజగృహమ్మట దిగెను వేగ! 2-91-33

అట్లె చతురస్రయుతము, సమధిక విస్తృ
తమును, శయ నాసన వహయుతమును, దివ్య
సర్వరసయుక్త, మహిత భోజన పటమగు
దివ్య రాజగృహమ్మట దిగెను వేగ! 2-91-34

అట్లె యుపకల్పిత వర సర్వాన్న, ధౌత
యాతు భాజన, కౢప్త సర్వాసన, కృత
విస్తరిత శయనమునగు వేశ్మమైన
దివ్య రాజగృహమ్మట దిగెను వేగ! 2-91-35

దీర్ఘబాహుండు కైకయీ దేహజుండు
నైన భరతుండు మున్యాజ్ఞనంది, శ్రేష్ఠ
వస్తుచయ మండితమగు నా భవనమునను
వేగముగఁ బ్రవేశించెను ప్రీతితోడ! 2-91-36

మంత్రులుం బురోహితులును మాన్య భరతు
ననుసరించియుం జని, యా గృహమునఁ జొచ్చి,
యట భరద్వాజుఁ డొనరించినట్టి సంవి
ధానమునుఁ గాంచి, మిగుల సంతసముఁ గొనిరి! 2-91-37

సచివయుతుఁడైన భరతుఁ డచ్చట వఱలెడి
దివ్యసింహాసనమునకు, దీప్తములగు
ఛత్రచామరములకు భూజానికి వలెఁ
దాఁ బ్రదక్షిణ మొనరించెఁ దన్మయుఁడయి! 2-91-38

రామునకు నమోవాకమ్ములను నిడి, వర
సింహపీఠిఁ బూజించి, యౌశీరముఁ గర
మందునం గ్రహించియుఁ దాను, మంత్రివరులు
కూర్చొనఁగఁ దగు గద్దెపైఁ గూర్చొనియెను! 2-91-39

అంత మంత్రి పురోహితు లనుగతిఁ జని,
యాసనమ్ములఁ గూర్చుండ; నపుడు దండ
నాయకుఁడు వారి వెనుక వినమ్రుఁడగుచు
వరుస నుపవిష్టుఁడాయె విశ్వాసయుతుఁడు! 2-91-40

అంత నట భరద్వాజుని యాజ్ఞచేత
క్షణమునందునఁ గొన్ని సాగరగలు భర
తుని సమీపించెఁ; గర్దమమునకు బదులు
పాయసము గలదందు విభ్రమముఁ గొలుప! 2-91-41

ఆ నదులకున్న తీరద్వయమ్మునందుఁ
గలుగు సుందర దివ్య నికాయము కమ
లాసనుని దయచేఁ బుట్టె; నా గృహములు
పాండు మృత్తిక లేపనోద్భరితములయె! 2-91=42

ఆ సమయమందు నలువయే యనుపఁగాను,
దివ్య భూషణాలంకృత స్త్రీ లిరువది
వేల సంఖ్యాకు లచటి నివేశమునకు
నేఁగుదెంచిరి క్రమముగా నింపుఁగొలుప! 2-91-43

ఆ సమయమందుఁ ధనదుఁడే యనుపఁగాను,
స్వర్ణమణిముక్తవిద్రుమాభరణశోభి
తలగు నిరువదివేలైన తలిరుఁబోఁడు
లేఁగుదెంచిరి యచటకు నిమ్ముగాను! 2-91-44

ఎవరి చేతనుఁ జిక్కిన యే పురుషుఁడు
వెఱ్ఱివానిపోల్కినిఁ గనిపించు, నట్టి
వింశసాహస్రికాప్సరోవితతి నంద
నవనమందుండి యిటకు మొనసెను వేగ! 2-91-45

సీర తేజస్సమన్విత శ్రేష్ఠులు నగు
గోప తుంబుర నారద కుంజర సము
లైన గంధర్వరాజులు నచటి భరతు
సన్నిధిం బాడి రప్పుడు శ్రావ్యముగను! 2-91-46

అటు పిదప భరద్వాజుని యానతిఁగొని,
వామనయుఁ బుండరీకయుఁ బరఁగ నటులె
మిశ్రకేశి యలంబుసల్ మిన్నయైన
భరతు మ్రోల నాడిరి నేత్రపర్వముగను! 2-91-47

ఆ భరద్వాజు నాజ్ఞచే నమరలోక
చైత్రరథవన పుష్పిత సరము లటఁ బ్ర
యాగ భూములం బ్రభవించె నపుడు వనికి
సుందరత్వమ్మునలఁదఁగఁ జోద్యముగను! 2-91-48

ఆ భరద్వాజు నాజ్ఞచే నచటి బిల్వ
కుజములయ్యె మార్దంగిక కులముగాను;
తాళములువేయువారయ్యెఁ దాండ్రచెట్లు;
నర్తకులునయ్యె నశ్వత్థనగము లపుడు! 2-91-49

కానుగులుఁ దాళ్ళుఁ దెల్లతెగడలు బొట్టు
గులు భవనమందుఁ దిరుగాడు కుబ్జ వామ
నులుగ మాఱి, సంతోషమందుచును వచ్చి
చేరె నందఱ మెప్పింప స్థిరముగాను! 2-91-50

అడవులందునఁ గల శింశుపామలకులు
జంబు మాలతీ మల్లికా జాజి మొదలు
గాఁగలట్టి వృక్షమ్ములు కంజముఖుల
యాకృతిఁ గొని భరద్వాజు నాశ్రమమున
కేఁగుదెంచియు వారితో నిట్టులనెను. 2-91-51

“ఓ సురాసువులార! మీ రోపినంత
మద్య మానుఁడు! క్షుధితులుం బాయసమ్ముఁ
గొనుఁడు! పూత మాంసమ్ములఁ గోరి కోరి
భక్షణము సేయుఁ డోయి మీ స్వాస్థ్య మెసఁగ!” 2-91-52

ఏడు నెనమండు రంగన లేక పురుషు
నాపగా తీరమునకుఁ దా మాదరమునఁ
దీసికొనిపోయి, నలుఁగులం దిటవుగాను
పెట్టి, స్నాతులఁ జేసిరి ప్రియముగాను! 2-91-53

వారి దేహము లొత్తఁగా వారిజాక్షు
లటకు శీఘ్రమ్ముగా వచ్చిరయ్య; యటులె
వారి యొడలుఁ దుడిచి, పరస్పరము మదిరఁ
ద్రావఁజేసిరి కొందఱు తలిరుఁబోండ్లు! 2-91-54

వహనపాలు రశ్వములకు, వారణముల
కును, ఖరములకు, నొంటెలకును, వృషభము
లకును మేఁతఁ దెచ్చియు, యథాక్రమముగాను
ప్రేమతోఁ దినిపించిరి విధి యుతముగ! 2-91-55

వరబలయుతులౌ వాహనపాలకులగు
వార లిక్ష్వాకు వరయోధ వాహనములఁ
“దినుఁడు తినుఁ” డంచుఁ బ్రేరేఁచి, దిటవుగాను
నిక్షుమధులాజలను దినిపించిరపుడు! 2-91-56

అశ్వబంధకుఁ డరయఁ డా యశ్వములను;
కుంజరగ్రాహి యరయఁ డా కుంజరముల;
నిటుల నా చమూతతియె మత్తిల్లి సంత
సమ్మునందుఁ దేలినదప్పుడిమ్ముగాను! 2-91-57

సర్వభోగతృప్తులు, రక్తచందనమ్ము
పూయఁబడినట్టివారలు, పొలుపుమీఱ
నప్సరోగణసంయుక్తులయినయట్టి
సైనికులు వల్కి రిట్టుల సంతసమున! 2-91-58

“మే మయోధ్యకు వెడలము! మేము దండ
క వనమునకును వెడలము! ఘనత వెలయ
నుందు మిటనె! భరతునకు భందిల! మ్మ
టులనె రామునకును శుభమ్ములును నగుత!” 2-91-59

కాలిబంటు, లాశ్వికులును, గజములెక్కు
వారలును, వాని పాలకుల్ వలికి రిటులఁ
’దమను నియమించు ప్రభువులు ధరణియందు
లే’ రటంచు స్వతంత్రులై బీరమునను! 2-91-60

వేలకొలఁదులౌ భరతుని కాలిబంటు
లపుడు సంప్రహృష్టులగుచు విపుల నినద
ము లెసఁగఁగ “స్వర్గ మిదె” యని ముదముతోడఁ
బలికి రందఱు వినఁగాను పరవశమున! 2-91-61

ఆర్తవ సరులం దాల్చినయట్టి వేల
కొలఁది సైనికుల్ నృత్యముల్ సలిపి, నగుచు,
పాటలం బాడుచును, నాల్గు వైపులకును
పరువులెత్తుచునుండిరి భ్రాంతితోడ! 2-91-62

అంత నమృతోపమానమౌ యన్నము భుజి
యించినట్టి యవ్వారికి, హిత మొసంగు
దివ్య భక్ష్యమ్ములను జూడఁ, దినఁగ నిచ్చ
మదినిఁ గలిగె నా సమయాన మఱల మఱల! 2-91-63

అచట నున్న సహస్ర సంఖ్యాకులైన
దాస దాసీలు వనితలు దాడికాండ్రు
నందఱును నలఁగనియట్టి యంబరములఁ
దాల్చి, తృప్తులై యెసఁగి రా తరుణమందు! 2-91-64

అచటి గజములు, ఖరములు, హయము, లుష్ట్ర
ములును, గోవులు, మృగఖగములును, మిగులఁ
జక్కఁగాఁ బెంపఁబడినట్టి సకల జీవు
లన్ని యొండొరు బాధింప నెన్నవు మది! 2-91-65

అట్టి సైన్యాన సితవస్త్ర మమరఁగొనని
వాఁడు గాని, యాఁకలిఁగొన్నవాఁడు గాని,
మలినుఁడుం గాని, నాశ కుంతలుఁడు గాని
యెవ్వఁడును గానరాఁడాయె నవ్వనమున! 2-91-66

ఆ భటు లచట నజ వరాహ పలలముల
చేత, వ్యంజనోత్తమములచేత, సుఫల
రసముచేత నిండిన గంధ రస విశిష్ట
సూపముల నెన్నియో యప్డు చూచిరి వెస! 2-91-67

అటులె పుష్పధ్వజవతులునైన వేల
కొలఁది యన్నంపు లోహపాత్రలను నాల్గు
దెసల విస్మిత వదనులై దీక్షతోడఁ
గాంచి రంద ఱచ్చట నప్డు ఘనముగాను! 2-91-68

ఆశ్రమపుఁ బార్శ్వములనుఁ బాయస నిషద్వ
రంపుఁ గూపాల గములు నేర్పడెను! నచటఁ
గలుగు గోవులు కామదుఘలుగ మాఱె!
వృక్షములు మధువునుఁ బ్రసవించుచుండె! 2-91-69

అచట మద్య పూర్ణములైనయట్టి బావు,
లటనె మార్గమాయూరకౌక్కుట వరిష్ఠ
మాంసచయములు యోగ్యకుంభమ్ములందు
వండఁబడి, రాశులుగఁ బోయఁబడియునుండె! 2-91-70
వేలకొలఁదిగ నచ్చట స్థాలికలును,
లక్షలుగ గిన్నెలుఁ, బదికోట్ల కనకంపుఁ
బాత్రలును, దధిపూర్ణలౌ పలు తబుకులు,
చిన్న కడవలు, పళ్ళెముల్ సెలఁగ నుండె! 2-91-71

షట్పాది:
యౌవనస్థయు, శ్వేతయునై, సుగంధ
యై, కపిత్థ వర్ణయయినదౌ దధి భరి
తంపు హ్రదము, లటులె రసాలంపు హ్రదము,
లర్జునపు దధి హ్రదములు, నటులె పాయ
సంపు హ్రదములు మఱియునుఁ జక్కెర కలి
పిన యవల పిండి ప్రోవులు వెలసె నచట! 2-91-72

వార లా నదీతటమునఁ బలు రకముల
కల్క చూర్ణ కషాయముల్ గనిరి! యటులె
రకరకమ్ముల పాత్రలన్ రకరకముల
స్నానపుం బదార్థముల దర్శనముఁ గొనిరి! 2-91-73

తత్ప్రదేశమ్మునందు నంతటను వారు
తెల్ల కుంచెలుగల పండ్లపుల్లల గమి,
డొప్పలఁ దెలి చందనపుఁ బిడుచల, శుభ్ర
దర్పణములను గాంచిరి తనివితీఱ! 2-91-74

అటులె వసనచయములఁ, గాలాంజనములఁ,
దువ్వెనలనుఁ, గూర్చెలనుఁ, బాదుకల, వస్త్ర
ములను, ధనువులను, కవచములను మఱియుఁ
జిత్ర శయనాసనముల, వాజి క్రమేల
రాసభ గజాదుల సలిల హ్రదముఁ గనిరి! 2-91-75

దిగుట కనువైన రేవు; లిందీవరోత్ప
లసహితాకాశవర్ణతుల్యామలాంబు
భరసుఖప్లవహ్రదములు; పశువులు గొను
నీపవైడూర్యవర్ణవానీరకసము
దాయముం గాంచిరయ వారు తనివితీఱ! 2-91-76

ఆ మునియె భరతున కిడు నద్భుతమగు
నాతిథేయమ్ము స్వప్నలోకాచరితము
వలెను నుండఁ గాంచినయట్టివారలంద
ఱచ్చెరువునంది “యహహా” యటంచు ననిరి! 2-91-77

ఇటుల నందనమున విహరించు సురల
యట్టు లా భరద్వాజు రమ్యాశ్రమమున
వార లందఱు విహరింపఁ, బరఁగ నపుడు
రాత్రి గడచియుఁ దూర్పు తెల్లఁబడె మిగుల! 2-91-78

ఆ నదులును గంధర్వులు నంద ఱుత్త
మాంగనలు భరద్వాజుని యాజ్ఞ వడసి
యెటుల వచ్చిరో యట్టుల హితకరముగ
మఱలిపోయిరి శీఘ్రగమనులునగుచు! 2-91-79

అప్సరాదులు వెడలినయంత, నరులు
మత్తునను మున్గి, యచ్చటం బడియునుండి;
రటులె వా రలఁదిన చందనాగరు లపు
డార్ద్రమైయుండె; సుమదివ్యహారము లట
నవనిపైఁ బడియుండెఁ దదవసరమున! 2-91-80


[ఇది వాల్మీకి విరచిత ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమ్మునకుఁ దెనుఁగు పద్యానువాదమగు మధుర రామాయణములోని అయోధ్యాకాండ మందలి తొంబది యొకటవ సర్గము సమాప్తము]

స్వస్తి



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి