5, జనవరి 2020, ఆదివారం

మధుర రామాయణము: యుద్ధ కాండము – 31వ సర్గము

మధుర రామాయణము
యుద్ధ కాండము – 31వ సర్గము

lined images of ramayana hd కోసం చిత్ర ఫలితం

[రావణుఁడు రాముని మాయా శిరస్సును ఛేదించి, తీసికొనివచ్చి, సీతకుఁ జూపి, యామెకు దుఃఖముఁ గలిగించుట]

పిదప "నదవదపడఁజేయ వీలుపడని
సేనయుఁగల రాముఁడు లంకలోనఁ గల సు
వేల పర్వతమందున విలసిలుచును
నిలిచె" ననిరి యా రావణుని ప్రణిధులట! 6-31-1

అట్లు ’రాముఁడు గొప్ప సైన్యమ్ముతోడ
వచ్చియుండె’ నటంచును ప్రణిధుల వల
న విని, రావణుండును సుంత నడుఁకుఁ గొనియు,
వేగ సచివులతోడఁ దా వినిచె నిట్లు. 6-31-2

“మాకు మంత్ర కాలమ్ము సంప్రాప్తమయ్యె!
మంత్రులౌ రక్కసులు వినమ్ర మతులగుచు,
శీఘ్రముగ నందఱును నాదు చెంతఁ జేర,
వచ్చెదరు గాక యిప్పుడే పరుగులెత్తి!” 6-31-3

అనిన రావణు నానతి నంతను విని,
మంత్రులందఱు సరఁగునం బరుగులిడుచు
నేఁగుదెంచఁగ, వారితో హితకరమగు
యోచనము సేసె రావణుం డుద్ధృతముగ! 6-31-4

ఎదురుకొన శక్యమేకాని యిట్టి రావ
ణుం డనంతర కార్యమ్మును మనమునను
యోచనము సేసి, మంత్రుల కుత్తరు విడి,
పంపివైచి, తా నిలు సొచ్చెఁ బరఁగ నపుడు! 6-31-5

ప్రథితమౌ మాయలుంగల రావణుఁ డపు
డమిత మాయావి, బలవంతుఁడైనవాఁడు,
ఘనుఁడునైన విద్యుజ్జిహ్వు తనదు వెంటఁ
దీసికొని, సీత యున్నట్టి దెసకు జనెను! 6-31-6

రావణుఁడు, మాయలెఱిఁగిన రాక్షసుఁడును
తోడ నడచు విద్యుజ్జిహ్వుతో “జనకజ
సీతనున్ మోహితగ మాయచేతఁ జేయు
ద” మని పలికెను తన యోచితమునుఁగూర్చి! 6-31-7

“ఓయి రాక్షస! రాఘవు నుత్తమాంగ
మును, నతనివౌ ధనుర్బాణములను మాయ
చేత నిర్మించియును, నాదు చెంత కిపుడు
శీఘ్రమే తె” మ్మటంచును స్థిరతఁ బలికె! 6-31-8

రావణుని పల్కులను విని రాక్షసుండు
“నటులె చేసెద నో ప్రభూ!” యనియుఁ బలికి,
సుప్రయుక్తమౌ తన మాయఁ జూపఁ, బ్రభువు
రావణుఁడు సంతసిలి, యాభరణము నిడెను! 6-31-9

అవల ఘనబలుండగు రావణాసురుండు
మైథిలిం జూడవలెనని మనసు పడియుఁ
దా నశోకవనమ్మునఁ ద్వరితముగను
నడుగుపెట్టె నుత్సాహమ్మె యగ్గలించ! 6-31-10

అంత నాతం డశోకవనాంతరమున
నేలపైఁ గూర్చొనియునున్న నేలపట్టి
సీతనుం గనె! తలను డించియును సీత,
శోకమగ్నయై, పతిని సంస్తుతుల వొగడి,
ధ్యానముం జేయుచుండెను తఱచి తఱచి! 6-31-11

స్థిర భయంకర రాక్షస స్త్రీలు సీత
చెంతఁ గూర్చుండి రక్షణ సేయుచుండ,
నామెనుం జేరి రావణుం డేమొ శుభపుఁ
బ్రస్తవముఁ జెప్పునట్లు ధార్ష్ట్యమునఁ బలికె. 6-31-12

“అవనిజా! నేను నిన్నెంతఁ బ్రార్థనమ్ము
సేసినను, నీ వెవని యండ స్థిరమటంచుఁ
జూచుచును, నన్నుఁ దృణసదృశునిగఁ జూచి
నావొ, యట్టి నీ భర్త, రణమ్మునందుఁ
జంపఁబడినాఁడు మా చేత సత్వరముగ! 6-31-13

సీత! సర్వవిధముల నాచేత నీదు
మూల మిప్పుడు ఛేదనమ్ము జరుపఁబడి,
నీదు దర్పమ్మణఁపఁబడె నిక్కముగను!
నిట్టి వ్యసనమ్ముననుఁ జిక్కినట్టి నీవు,
నాకు భార్యగాఁ గమ్ము వినమ్రవయ్యు! 6-31-14

మూఢురాల! నీ యోచనమ్మును వదలుమ!
యెడలి చనినట్టి మగనితో నేమి సేతు
వీవు? మంగళప్రదురాల! యిపుడు నాదు
భార్యలందఱిపయి నాధిపత్యవగుము! 6-31-15

అల్పపుణ్యురాలా! నివృత్తార్థురాల!
మూఢ! పండితమానిని! భూమిపుత్రి!
వృత్రవధవంటి నీదు భర్తృవధఁ గూర్చి
చెప్పుచుంటిని వినుమిప్డు స్థిరమనమున! 6-31-16

పరఁగ రాముండు సుగ్రీవు పర్యవేక్ష
ణమ్మునను నడుపఁబడు సైన్యమ్ముఁగూడి,
నన్నుఁ జంపంగ సంద్రపుం దరికిఁ జేరి
యుండెనఁట యుత్సహించుచు మెండుగాను! 6-31-17

అంత రాముండు కమలమిత్రాస్తమయ స
మయము నందు మహాసైన్యమాన్యుఁడగుచు
సాగరోత్తరతీరమ్ముఁ జఱచి, యచటె
విదిదిచేసియు నుండెను వీర్యమెసఁగ! 6-31-18

అధ్వమందున నలసియు నర్ధరాత్రి
సమయమునను నిద్రించియుఁ జక్కనున్న
సైన్యమును ముందు నా గూఢచరులు బాగు
గాఁ బరీక్షించి రచట వీక్షణములొప్ప! 6-31-19

అల ప్రహస్తుని సన్నిర్వహణమునందు
గొప్పదౌ నాదు సైన్యమ్ము గూఢముగను
జనియు, రామలక్ష్మణులున్న స్థలమునంద,
రాత్రమునఁ జంపె రాముని రాణువలను! 6-31-20

షట్పాది:
పట్టిసలు, చిన్న చక్రముల్, పరిఘములును,
దండములు, ఋష్టులు, మహాయుధములు, బాణ
ములును, శూలముల్, మెఱసెడి ముద్గరములు,
యష్టులును, తోమరాల్, బల్లియములు, చక్ర
ములు, ముసలము లెత్తియు రాక్షసు లట వాన
రులను జంపిరి కఠినులై క్రోధమునను! 6-31-21

పిదప, హింసించునట్టి ప్రవృత్తి గలుగు
జడుఁడు, కృతహస్తుఁడగు ప్రహస్తుఁడు కృపాణ
ముఁ గొని, నిద్రించునట్టి రాముని శిరము ని
రర్గళమ్ముగా ఛేదించె నపుడు వడిని! 6-31-22

దైవవశమున రాక్షసుల్ దవుల నెగిరి,
యచట నున్న విభీషణు నదిమిపుచ్చి,
బంధితునిఁ జేయ, సౌమిత్రి వానరులను
మిగిలినట్టివారలతోఁ జెలగుచుఁ బాఱె! 6-31-23

పృథ్విజ! కపీశుఁడయిన సుగ్రీవు కంఠ
మునట రాక్షసుల్ విఱచిరి; హనుమని హను
వును పగులఁజీల్చి; రని జానువులనుఁ బయికి
లేచు జాంబవంతునిఁ జంపిరి; యతఁ డచట
మొదలు నఱకిన వృక్షమ్ము మొగినిఁ గూలె! 6-31-24

పొడుగరులు, శత్రునాశకు, లడరు ఘనులు
నైన మైందద్వివిదులను వానరవరు
లు నట నిట్టూర్పు విడచుచు, రోహితమునఁ
దోఁగి, రోదించుచుండఁగాఁ దుంటి దనుక
ఖండనముసేయఁబడినారు ఘనదురమున! 6-31-25

పనసుఁ డనువాఁడు, కోసిన పనసచెట్టు
చూడ్కి నేలపైఁ బడి యేడ్చుచు నిలువఁగ! ద
రీముఖుం డనేకపు లకోరీలచేత
ఛేదనము కాఁబడియు, గుహం జేరి చచ్చెఁ!
గుముదుఁ డఱచుచు, బాణాలఁ గూల్పఁబడెను! 6-31-26

రాక్షసు లనేక బాణంపుఁ బ్రసరణముల
ఛేదనము సేయ, నంగదుఁ డా దరిఁ దన
యంగదములు నేలం బడ, నార్తుఁడగుచు,
రక్త సంప్లావితుఁడయి మరణమునందె! 6-31-27

పరఁగ నిద్రించు నితర వానరుల, నేన్గు
లను రథమ్ముల, వాయువులును పయోధ
రముల వేగమ్మునను నెగురంగఁగొట్టి
నటుల, నెగురఁగొట్టిరియట నసురు లుఱిమి! 6-31-28

ఇంకఁ గొందఱు వానరు, లేనుఁగులను
సింహముల వలె, రాక్షసుల్ సేరి వెన్కఁ
దఱుముచును వచ్చి, కొట్టుచుండంగ, భయము
మెయినిఁ బాఱిపోయిరి సుమ్ము రయముగాను! 6-31-29

వానరులు గొంద ఱచ్చటి వారిధిఁబడి
చనఁగ, మఱియునుఁ గొందఱు చదలు పయికి
నెగసి చన, నింకఁ గొందఱు నగచరులును,
భల్లుకమ్ములుఁ జెట్లపైఁ బ్రాఁకి యెక్కె! 6-31-30

చాల మంది వానరులను, సవికృత నయ
నులగు రాక్షస ప్రతతులు, జలధుల తట
ములను, శైలమ్ములను, వనములను వెదకి,
మృతులఁ జేసిరి తమబల మ్మిలను వెలయ! 6-31-31

నాదు పోటుబంటులు నీదు నాథుని, మఱి
యతని సేనలఁ జంపిరి; యటులె రక్త
సిక్తమౌ నీదు ప్రాణేశు శిరము, ధనువు
నాకు కాన్కగా నిడిరి వినమ్రులగుచు!" 6-31-32

అనుచు, నెదిరింపఁగా నశక్యమగు రాక్ష
సప్రభుండు రావణుఁడు నా జానకి విను
చుండ నొక్క రక్కసితోడ నొక్క మాట
నిటుల వచియించె నంతట దిటవుగాను! 6-31-33

“రౌద్ర కర్మమ్ము లొనరించు రాక్షసుండు
నైన యట్టి విద్యుజ్జిహ్వు నాదరమున
యుద్ధరంగమ్మునందుండియును నిటకును
’రాము శిర చాపములఁ గొని, ర’ మ్మటంచు,
నిటకుఁ దోడ్కొని ర” మ్మని యెటకొ యనిపె. 6-31-34

ఆజ్ఞఁ గొనియు విద్యుజ్జిహ్వుఁ డతి ముదమున
రాఘవుని శిరమ్మును, శరాశ్రయమును కర
మందుఁ దాలిచి, తలవంచి, మన్ననమున
రావణుని చెంత నుంపఁ దాఁ బ్రణతుల నిడె! 6-31-35

అంతఁ బ్రభువు రావణుఁ డప్పు డాత్మయందుఁ
గ్రుమ్మఱెడు మహాజిహ్వు, కర్బురుని, నచట
నిలచి యున్న విద్యుజ్జిహ్వుఁ బిలిచి, తాను
హితమితోక్తులతోఁ బల్కె నిటులఁ బూని. 6-31-36

“రాఁగదోయి విద్యుజ్జిహ్వ! రాముని శిర
మీవ శీఘ్రమ్ముగా సీత యెదుట నుంపు!
మామె తన పతికిం గల్గు నంత్య దశను
బాగుగా వీక్ష సేయుత, పలు విధముల!” 6-31-37

అనిన రావణు వచనమ్ము లా దనుజుఁడు
వినియుఁ, జూచుటకును నందమును నమరిన
యట్టి శిరమును సీతమ్మ యందిక నిడి,
శీఘ్రమే యగోచరుఁడయ్యె స్థిరముగాను! 6-31-38

“జ్యా సమావృతమైనట్టి చాప మిదియ
నీదు రాముని చాపమే! నిన్న రాత్రి
యా నరునిఁ జంపి, దానిఁ బ్రహస్తుఁడిటకుఁ
దెచ్చి యిచ్చెను స్వయముగా దీక్షతోడ!” 6-31-39

అనుచు నచట విద్యుజ్జిహ్వు నాన సేసి
నట్టి రావణుండప్డు మహాపతివ్ర
తయగు సీత ముందఱ రాము తలయు, ధనువు
వైచి “నీవు నాకును వశవర్తివగు” మ
టంచుఁ బలికెను సీతతో నాస్థ యెసఁగ! 6-31-40


[ఇది వాల్మీకి విరచిత ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమ్మునకుఁ దెనుఁగు పద్యానువాదమగు మధుర రామాయణములోని యుద్ధ కాండ మందలి ముప్పది యొకటవ సర్గము సమాప్తము]

స్వస్తి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి