5, జనవరి 2020, ఆదివారం

మధుర రామాయణము: ఆరణ్య కాండము – 29వ సర్గము

మధుర రామాయణము
ఆరణ్య కాండము – 29వ సర్గము
సంబంధిత చిత్రం

(శ్రీరాముఁడు ఖరుని నిందించుట; ఖరుఁడును శ్రీరాముని నిందించి, గదను ప్రయోగించుట; ఆ గదను శ్రీరాముఁడు ఖండించుట)

విపుల తేజస్వి రాముండు, విగత రథుఁడు
నై గదాపాణియై నిల్చినట్టి ఖరునిఁ
గనుచు, మృదువాక్యపూర్వమౌ కఠినమైన
వాక్యములఁ బల్కె నిట్టులఁ బదరి పదరి! 3-29-1

“నీవు రథగజాశ్వములతో నిండియున్న
గొప్ప సైన్యమ్మునకు నాయకుఁడవునయ్యు,
సర్వలోకజుగుప్సితశారుకకృత
మొనరిచితి విప్డు వెనుకాడకుండ యిటుల! 3-29-2

ప్రాణులన్నింటికిని భయోత్పాతముఁ గలి
గించుచుం, బాపకర్మమ్ములెంచి సేయు
క్రూరుఁడుఁ, ద్రిలోకముల నాయకుండయినను
జాల కాలము సుఖమొందఁజాల కెడలు! 3-29-3

దనుజ! లోకవిరుద్ధ కృతమ్ముల నొన
రించుచున్నట్టి క్రూరాత్ము నెంచి, సకల
జనులు, తముఁ జేరు దుష్ట భుజగమును వలెఁ
జంపివైతురు భువిలోన సరభసమున! 3-29-4

కక్కుఱితి వల్లఁ, గామవికార మెసఁగు
కతనఁ, బాపముల్సేయుచును, తన తప్పి
దమ్మునుం గ్రహింపనివాఁ డధముఁడయి, వడ
గండ్లఁ దిన్నట్టిదౌ నలికండ్లపాము
విధమునఁ నఘఫలమనుభవించు విధిగ! 3-29-5

అక్కటా! దండకారణ్యమందు నుండు
ధర్మచారులన్ మహితులౌ తాపసులను
వ్యర్థముగఁ జంపు కతమునఁ బరఁగ నీకు
లభ్యమౌనట్టి ఫలమేమి రక్కసీఁడ? 3-29-6

లోక నిందితుల్, పాపకర్ములునుఁ గ్రూరు
లంద ఱైశ్వర్యముం బొంది,  డిందినట్టి
మూలములుగల పాదపమ్ములకును వలెఁ,
జాల కాలమ్ము నిలువంగఁజాల రిలను! 3-29-7

సమయ మాగమించినయప్డె జంతుతతియుఁ
బాపకర్మమ్ములకు ఘోర ఫలముల, ఋతు
వేఁగుదెంచఁగఁ బుష్పమ్ములీను కుజము
లట్టులం దప్పకుండఁగ నందగలదు! 3-29-8

కౌణపా! లోకమునఁ బాపకర్మల ఫల
ము, భుజియించిన సవిషాణ భోజనమ్ము
పగిది, నచిర కాలముననే పతితు చేత
ననుభవింపఁగఁబడు నవశ్య; మిది నిజము! 3-29-9

ఘోరమైనట్టి పాపమ్ముఁ గోరి చేయు
పాపుల యసువులను, జనాపకృతిఁ గోరు
వారి యసువులఁ గొనఁగాను, ప్రభువునైన
నన్ను మునిజనాదులు గోరినార లసుర! 3-29-10

ఏ నిపుడు ప్రయోగించు పింజానభూష
ణ ఋజుగము, లహియె మహికర్ణమునుఁ జీల్చి
వెలికి వచ్చెడునటుల, నిన్ వేగఁ జీల్చు
కొనియుఁ బోఁగలవోయి సంకుల సమితిని! 3-29-11

ఇప్పు డీవు నా చేతను నీ దినమున
సమరమున సైన్య యుతముగాఁ జంపఁబడియు,
మున్ను నీ వీ వనిం జంపి తిన్న మునుల
ననుసరించి పోఁగలవాఁడ వగుదు వసుర! 3-29-12

ఇపుడు నా బాణముల పంక్తు లిటుల నిన్నుఁ
జీల్చి చంపఁగా, నరకమ్ముఁ జేరు నిన్ను,
మున్ను నీ చేత మరణమ్ముఁ గొన్న మునులు
వ్యోమయానమ్ము లందుండి పొడఁగనెదరు! 3-29-13

ఓ కులాధమ! నీ యిచ్చ యున్నయటుల
నన్నుఁ గొట్ట యత్నింపుము మిన్నగాను!
నేను నా బాణములచేత నీ శిరమును,
తాళఫలమునుఁ బోలెఁ గ్రిందఁబడవైతు! 3-29-14

అనిన రాముని మాటలు వినిన ఖరుఁడు
క్రోధమూర్ఛితుఁడై రక్తలోచనములఁ
రామునిం గనుచును తన ప్రతివచనము
నట్టహాసమ్ముతో నిచ్చె నిట్టులుగను! 3-29-15

“దశరథాత్మజ! మున్ను యుద్ధాన మిగుల
నల్పులౌ రాక్షసులఁ జంపి, యప్రశస్తుఁ
డవగు నిను నీవె స్వయముగాఁ బ్రవరుఁడనని
యేల నుతియించుకొనుచుంటి విప్పు డిచట? 3-29-16

సత్పరాక్రమవంతులు సబలవంతు
లైన నరవరుల్ స్వప్రభావాని కెపుడు
గర్వముం బ్రదర్శింపరు; కనఁగ నేమి
మాటలాడరు తముఁ గూర్చి మఱల మఱల! 3-29-17

వినయమే లేని సామాన్య జనులునైన
క్షత్త్రియాధముల్ మాత్రమే ఘనుల మనుచు,
నీ విపుడు ప్రగల్భమ్ముల నెట్టులంటి,
వట్టులే డంబముల డప్పుగొట్టెదరయ! 3-29-18

అగ్రగుండైన వాఁ డెవ్వఁడైన నమర,
సమరమందున మృత్యువాసన్నమైన
కోపునం, దన కులమునుంగూర్చి తెలిపి,
తన్నుఁ దానె ఘనుఁడని స్తోత్రమొనరుచునె? 3-29-19

కాల్పఁబడినట్టి దర్భలు క్షణము పాటు
స్వర్ణవర్ణభాసురమయి ప్రభలఁ గొనియు,
మఱు నిముసమునఁ దేజముం బాయునట్టు,
లాత్మశంసచేఁ బొడమె నీ యల్పత యిట! 3-29=20

ధాతువులచేత వ్యాప్తమై తనరు కణుపు
లును గలిగి వెల్గు క్షితిధరమ్ము నిలఁ బోలి,
కదలుపఁగను శక్యము కాని గదనుఁ దాల్చి
నిల్చియున్నట్టి నన్నుఁ గంటివె ధృతి నిట? 3-29-21

పాశహస్తుఁడై త్రైలోక్యవాసుల యసు
వులను హరియించు కాలుని వలెను, చేఁత
గదను ధరియించి యుద్ధరంగమున నీదు
ప్రాణములఁ గొనఁజాలుదుఁ బరఁగ నేను! 3-29-22

నీ విషయమున నే నిటం దెలుపఁ దగిన
యంశ మున్నను నేనేమి యన; నెటులన,
సూర్యుఁ డస్తంగతుండైనచో ననికిని
విఘ్నమేర్పడుం గాదె యెవ్విధినిఁ గనిన! 3-29-23

అకట పదునాల్గువేల సంఖ్యాకులైన
దనుజులం జంపితివి నీవు, కనఁగ నాఁడు!
నే నిచట నిన్నుఁ జంపియు నిక్కముగను
వారి కన్నీరుఁ దుడిచెద పరఁగ నేఁడు!" 3-29-24

అనుచు వచియించియుం బరమాంగదమ్ముఁ
దాల్చిన ఖరుండు మిగుల క్రోధమ్ముతోడఁ
దళ్కులీనెడు వజ్రాయుధమ్ముఁ బోలు
పెద్ద గదను రామునిపయి విసరె నపుడు! 3-29-25

ఖరుఁడు తన బాహువులతో విసరిన గదయె
మండుచుం, జెట్లఁ బొదల భస్మమ్ము సేయు
చును, నతనియొద్ద నుండి తాఁ జనియు వేగ,
రాఘవుని పయికిం జనెఁ బ్రబలముగను! 3-29-26

ప్రజ్వలించుచుఁ దా మృత్యుపాశము వలె
వచ్చి, తనపయిం బడుచున్న పరిఘను గని,
రాఘవుం డది మేఘవర్త్మమ్మునందె
యుండఁగా బాణములతోడ నుత్తరించె! 3-29-27

బాణములచేత నుత్తరింపంగఁబడిన
పరిఘ, మంత్రౌషధమ్ముల బలముచేతఁ
పడఁగఁగొట్టంగఁబడినట్టి పామువోలె,
ముక్కముక్కలుగా నయి భూమిఁ బడెను! 3-29-28


[ఇది వాల్మీకి విరచిత ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమ్మునకుఁ దెనుఁగు పద్యానువాదమగు మధుర రామాయణములోని ఆరణ్య కాండ మందలి యిఱువది తొమ్మిదవ సర్గము సమాప్తము]

స్వస్తి


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి