5, జనవరి 2020, ఆదివారం

మధుర రామాయణము: సుందరకాండము – 58వ సర్గము (83వ శ్లోకము నుండి 166వ శ్లోకము సర్గాంతము వరకు)


మధుర రామాయణము
సుందరకాండము – 58వ సర్గము

(83వ శ్లోకము నుండి 166వ శ్లోకము సర్గాంతము వరకు)

lined images of ramayana hd కోసం చిత్ర ఫలితం


 అటుల రాక్షసస్త్రీసమూహమ్ము నిదురఁ
జెందినంత, భర్తృహితైషి సీత, దీన
వదనయై జాలిఁ గొలుపంగ వగచి, మిగుల
దుఃఖితయునయ్యు నేడ్చెఁ దద్ద్రుమము క్రింద! 5-58-83

అప్డు రాక్షస స్త్రీల మధ్యమ్మునుండి
“త్రిజట” యనెడి రక్కసి సముత్థితయునయ్యుఁ,
దక్కు దానవాంగనల, ’నిద్రలను వీడి
లెం’ డటంచును, వారల లేపె నపుడు! 5-58-84

అట్లు వారల లేపి యా యతివ, “వినుఁడు!
జనక పుత్రియు, సాధ్వి, దశరథు స్నుషయు
నైన యీ సీత నశియింప! దందుకె యిట
మిమ్ము మీరలే తినుఁడు తున్మియును వేగ! 5-58-85

ఇప్పుడే నేను నొక భయంకృతము, రోమ
హర్షణమ్మగు స్వప్నమ్మునందు, దనుజ
నాశమును, నీమె పతి గెల్పు నా యెదురుగ
జరిగినట్టులఁ గంటిఁ ద్రాసమ్ముఁ గొనుచు! 5-58-86

ఇప్పు డీ మైథిలి నిటఁ బ్రార్థింపఁ దగును!
రాఘవునినుండి యీమెయే రాక్షస వని
తలను రక్షింపఁగను సమర్థయగుఁ గాన,
నిట్లు చేయుటే సరియని, యేఁ దలఁతును! 5-58-87

దుఃఖితులునైనవారి కెందునను నిట్టి
స్వప్నమే వచ్చు నెడల, నవ్వారలకును
దుఃఖములు నన్నియును వేగ దూరమయ్యు,
నధిక సుఖము లవెన్నియో యందఁగలరు! 5-58-88

జనకు దుహిత మైథిలికిఁ బ్రాంజలిని నిడిన
మాత్రముననే ప్రసన్నయౌ మాన్య!” యనఁగ,
వినిన బాల, సీత, స్వభర్తృవిజయమునకు
సంతస మ్మంది, వేగ పుచ్చటికఁ గొనెను! 5-58-89

అంత జానకి, ”యిదియ యథార్థ మయిన,
మిమ్ము రక్షింతు!” నన, వింటి సుమ్మచటనె
సుంత విశ్రమించియు, ’సీత కింత హీన
దుస్స్థితి యొదవె; దానినిఁ ద్రుంచెద’ నని
యోచనము సేసి, నిర్వృతి నొందనైతి! 5-58-90

పిదప సీతతో భాషించు వెరవునకయి
చింతనమొనర్చి, పిమ్మట, శ్రేష్ఠులైన
పాలకులగు నిక్ష్వాకు సద్వంశ ఘనుల
సచ్చరితమును వర్ణింపసాఁగితి నయ! 5-58-91

విమల రాజర్షిగణపూజితమగు వాక్కు
మన్ముఖమ్మున వినినంత, మైథిలి వెస,
బాష్పవారిపూరితనేత్రవక్త్రయయ్యు,
నన్నుఁ గాంచుచు, నిట్లనె మన్ననమున! 5-58-92

“ఎవఁడ వీ వయ్య కపివర! యేల యిటకు
వచ్చితయ? యెట్లు వచ్చితివయ్య? రాఘ
వునకు నీ కెట్లు స్నేహమ్ము పొసఁగెనయ్య?
సకల మెఱిఁగింపు మో యయ్య సరభసమున!” 5-58-93

అనిన జానకి వచనమ్ము లాదరమున
వినియు, సంతోష మందియు, వేగిరమున
హితమితోక్తి సహిత సుసమ్మత సమరస
భావ మందించు మాటలఁ బలికితి నిటు! 5-58-94

“దేవి! నీ భర్తకు నెర వందించు ప్రతిన,
ఘన బలుఁడు భయంకర పరాక్రముఁడునైన
వానరేంద్రుఁడౌ సుగ్రీవుఁ డూనియుండె,
మైత్రిపూర్వకమైన సమ్మాన మెసఁగ! 5-58-95

కడఁగి యిటకు వచ్చిన నన్ను ఘనయశుఁడగు
నట్టి సుగ్రీవు భృత్యుగా నరయు మమ్మ!
శ్రమము నందక కృత్యముల్ సలుపు రాఘ
వుండు నిను వెదుకఁగఁ బంపె దండిగ నను! 5-58-96

ఓ యశస్విని! యిలఁ బురుషోత్తముఁడును
శ్రీయుతుఁడగు దాశరథియె, శ్రేష్ఠవైన
నీకు గుఱుతుగాఁ జూపింప నిశ్చయించి,
స్వయముగా నుంగరము నిచ్చె రయముగాను! 5-58-97

తల్లి! యా కారణమున నీ దయనుఁ గోరు
చుంటి నో యమ్మ! యాజ్ఞప్తి నొసఁగుమమ్మ!
నిన్ను రామలక్ష్మణుల సన్నిధినిఁ జేర్తు!
నేమి సేయంగ వలయు నే నిపుడు చెపుమ?” 5-58-98

జనక సుత సీత నాదు వచనములు విని,
విషయమును గ్రహించియుఁ, దాను ప్రేమమీఱ,
ముద్దుటుంగరముం గొని, మురిసిపోయి,
“రాఘవుఁడు రావణుం జంపి, రయముగాను,
నన్నుఁ గొనిపోవుఁగాక!” యన్నది తిరముగ! 5-58-99

అపుడు పూజ్య, నిర్దోషయౌ యవనిజకును
శిరము వంచియుఁ బ్రణమిల్లి, శీఘ్రముగను
“రాఘవునకు నాహ్లాద సంప్రాప్తదత్త
మౌ యభిజ్ఞాన మొకటి యి” మ్మంటి నేను! 5-58-100

“శ్రేష్ఠమైన శిరోమణిన్ స్వీకరించి,
యిచ్చుచో, మహాబాహుండు, నినకులుండు
దీనిఁ గని, మెచ్చుకొనుచును, ధీరత నిను
నాదరించు నో పావని, యతిముదమున!” 5-58-101

అని పలికి వరారోహయౌ యవనిజ నిజ
శీర్షరత్నమ్ము నిచ్చియు క్షిప్రముగను,
మిగుల నుద్విగ్నయై నాకు మేలిమినిడు
సరణి సందేశ మిడె సద్వచస్సుతోడ! 5-58-102

అట్టి సందేశమును నేను సావధాన
చిత్తమున విని, మది మిమ్ముఁ జేర, జనక
జాతకునుఁ బ్రదక్షిణమిడి, సరభసమున
బయలుదేరఁగఁ బూనితి వనమునుండి. 5-58-103

స్వచ్ఛమతి సీత యెదియొ నిశ్చయముఁ గొనియు,
మఱల ననుఁ బిల్చి, నాతోడ మాటలాడె;
“మారుతీ! నీవు రామునిఁ జేరి, పలుకు
లొప్ప, నాదు వృత్తాంతమ్ముఁ జెప్పుమయ్య! 5-58-104

నీదు మాటల నప్పుడు నిశ్చల మతి
వీరులౌ రామలక్ష్మణుల్ విన్న పిదపఁ,
దాము సుగ్రీవ సహితులై త్వరితముగను
నిటకు వచ్చెడునట్లొనరింపుమయ్య! 5-58-105

వారు రాకున్న నాదు జీవనము రెండు
మాసములు మాత్ర మిచటఁ బెంపారును! నటు
వెనుక రఘురాముఁ డిల నన్నుఁ గనఁగలేఁడు,
నే ననాథగ నిట మరణించు కతన!” 5-58-106

ఆ దయామయ వాక్కు విన్నంతలోన
మిగులఁ గోపమ్ము నాలోన మెక్కొనఁగనె,
పిదపఁ జేయంగఁదగిన చెయిదము లెవియొ
చింతనము సేసితిని నేను స్థిమితముగను! 5-58-107

అపుడు నా మెయి ఘనపర్వతాకృతిఁగొన,
నెదిగిపోయితి! మదిని యుద్ధేప్సితమ్ము
కడలుకొనఁగాను, తద్వనక్షయము సేయఁ
గృత్యముల మొదలిడితిని క్షిప్రముగను! 5-58-108

వికృత వదనలౌ రక్కెస వెలఁదులంత
నిద్రనుండియు మేల్కాంచి, నివ్వెఱఁగునఁ
బాఱిపోయెడి మృగములు పక్షులు గల
వృక్షషండమ్మునుం గాంచి, భీతిలిరయ! 5-58-109

అంత వార లా యా ఠావులందునుండి
వచ్చి, ననుఁ జూచి, వేగమే వారి ప్రభువు
రావణునిఁ జేరి, యచట సంప్రాప్తమైన
నాదు కృతముఁ గూర్చియుఁ జెప్పినా రతనికి! 5-58-110

“ఓ మహాబల! రాజ! మహోన్నతమగు
నీ పరాక్రమ మ్మెఱుఁగక, నీచమైన
వానరమ్మొండు, చొరరాని వనమునందుఁ
జొచ్చి, భగ్న మ్మొనర్చెను చూడుమయ్య! 5-58-111

ఓ మహారాజ! నీ కిట్టు లోగొనర్చి
నట్టి దుర్బుద్ధియౌ క్రోఁతి, కత్యయమ్ము
కలుగు నట్టులుగాఁ జేయఁగాను వేగ
నతనిఁ జంపంగ భటులకు నాజ్ఞ నిండు!” 5-58-112

వారి మాటలు వినిన రావణుఁడు వేగ,
తన మనోఽనుగులనఁగనుఁ దగు భటులను
నంపె నేనున్న వనమున, కచటి నాదు
కృతములన్నియు నరికట్టఁ గినుకఁ బూని! 5-58-113

శూలముల ముద్గరమ్ములఁ గేలఁ దాల్చి,
వనమునకు నేఁగుఁదెంచిన భటు లెనుఁబది
వేలమందితోఁ బోరియు, వేగ నేను,
నాదు పరిఘచేఁ జంపితి మోఁది మోఁది! 5-58-114

అటుల నాచేత హతులైన యసురభటులు
కాక, తక్కిన భటులు శీఘ్రముగఁ జనియు,
“రాజ! నీ సైన్యమంతయు మ్రందె!” ననుచు,
రావణునకుఁ జెప్పిరి వివరమ్ముగాను! 5-58-115

షట్పాది:
వారు చనఁగానె, నా మదిన్ వఱలఁగ నొక
బుద్ధి, యచ్చటి యుద్యానమునను నున్న
చైత్యహర్మ్యాక్రమముఁ జేసి, స్తంభముఁ గొని,
రక్కసులఁ జంపియును నేను క్రమముగాను,
లంకకే నగయైన హర్మ్యము నడఁచితి! 5-58-116

పిదప దశకంఠుఁ డెంతయో బెడిదపుఁ బొడ
గల్గు రక్కసులనుఁ గూడి కనలు, ఘన ని
శాటుఁడగు ప్రహస్తుని సుతు జంబుమాలి
నాన సేసెను ననుఁ గూల్ప నతి రయమున! 5-58-117

ఆ మహాబల సంపన్ను నసురుని రణ
కోవిదుని ననుచరులతోఁ గూడినట్టి
జంబుమాలినిఁ బరిఘచేఁ జంపితి నతి
ఘోరముగ నప్డు యుద్ధానఁ గ్రుద్ధుఁడనయి! 5-58-118

వాని మరణ వార్తను విని పంక్తికంఠుఁ
డప్పు డతిబలులగు సచివాత్మజులను
కాలిబంటుల తోడుతఁ గదనరంగ
మునకు నంపెను నను నెదుర్కొనఁగ వేగ! 5-58-119

వారి నందఱఁ బరిఘచేఁ బార్పర సద
నమున కే నంపఁగా, రావణ ప్రభుండు
మంత్రిపుత్రుల మృత వర్తమానము విని,
శూరులౌ పంచ వాహినీశులనుఁ బంపె! 5-58-120

నేను సైన్య సహితులు మంత్రిసుతులైన
వారి నందఱఁ జంపఁగాఁ, బంక్తికంఠుఁ
డటు పిదప, మహాబలుఁడగు నక్షుని, దను
జ యుతముగ నంపె నాతోడి జగడమునకు! 5-58-121

వాని, మందోదరీ సుతు, ప్రధన పండి
తు, గగనోత్క్రాంతు, ఖేటశస్త్రుఁడగు నక్షు,
కాళులం బట్టి వేగమ్ముగాను నూఱు
మాఱులం ద్రిప్పి, నేలనుం బడఁగఁగొట్టి,
పిండిగాఁ జేసి, చంపితి వీరమునను! 5-58-122

ఆ దశాననుఁ, డనిసేయ నటకు వచ్చి
నట్టి యక్షకుమారుఁ డీ హనుమవలన
హనువు నందిన వార్తను వినియు, మిగులఁ
గ్రుద్ధుఁడై, యుద్ధ దుర్మద బద్ధు నింద్ర
జిత్సమాఖ్య సుతుని నిదేశించె ననికి! 5-58-123

నేను దనుజ సైన్యమును మ్రందించి, దనుజ
పుంగవుని మేఘనాదునిఁ బోరునందు
విగత బలునిగా నొనరించి, మిగుల సంత
సమ్ము నందితి నప్పుడు సమర భువిని! 5-58-124

ఆ మహాబాహు, నతిబలుండయిన యింద్ర
జిత్తును, మదోత్కటుల నురసిలుల వెంట
నిడియు, నెంతయో నమ్మి, జగడ మొనర్పఁ
గాను రావణుండే యంపెఁ గదనమునకు! 5-58-125

అట్టి యింద్రజితుఁడు స్వీయ ధట్ట నాశ
మునుఁ గనియు, నన్ను మార్కొనఁగను నశక్తుఁ
డనను విషయమ్ము నెఱిఁగియుఁ, దాను ననుఁ ద్వ
రితముగాను బ్రహ్మాస్త్ర బంధితునిఁ జేసె! 5-58-126

పిదప నా రాక్షసులు నన్ను పెద్ద త్రాళ్ళ
చేతఁ గట్టియు, దానవ శ్రేష్ఠుఁడైన
రావణుని చెంత కతిబల్మి లాఁగికొనుచుఁ
దీసికొనిపోయి నిలిపిరి తిరముగాను! 5-58-127

దుష్టబుద్ధియౌ పంక్తివక్త్రుండు చూచి,
“పదరి యీ లంక కెందుకు వచ్చితీవు?
దనుజులను నట్టు లెందుకు తునిమినా?” వ
టంచుఁ బ్రశ్నించె నన్నప్పు డాగ్రహమున! 5-58-128

షట్పాది:
అందులకు నేను “ సీతకై యట్టి పనులు
నేను సేసితి” నంచు నంటినయ! యటులె
“దానవేంద్ర! సీతనుఁ జూడఁదలఁచి నీదు
భవనమున కేను నిట్టుల వచ్చి! తేను
వాయునందనుండను! నాంజనేయ నామ
కుఁడగు వానరుండను!” నని నుడివితినయ! 5-58-129

“క్రోఁతినగు నేను శ్రీరామదూత! నటులె
భానుజుని సచివుండను! నేను రామ
దౌత్యమునకయి నీదు చెంతకునుఁజేర
వచ్చితిని రాజ!” యనుచునుఁ బలికితినయ! 5-58-130

“మహిత తేజస్వి, సూర్యకుమారుఁడు నిను
క్షేమ మడిగియు, ధర్మార్థకామములకు
నానుకూల్యమౌ, హితకరమౌ వచనము
నీకు నంపె” నటంచునుం దెలిపితినయ! 5-58-131

“ఉన్నతములైన వృక్షమ్ములున్న ఋశ్య
మూకపర్వతమ్మందునఁ బొదలునపుడు,
రణపరాక్రముండైనట్టి రాఘవునకు,
నాకు మైత్రి చేకుఱె!” నంచు వాకొనియును; 5-58-132

“ప్రభువు రాముండు నా తోడఁ బలికె ’హనుమ!
నాదు భార్యను రాక్షసుం డపహరించె!
తద్విషయమయి సర్వవిధమ్ములుగను
నీవు మాకు సాహాయ్యమందించు’ మంచు! 5-58-133

వాలి వధఁ గూర్చి నే రామభద్రునకును
తెలిపి, ’తద్విషయమ్మున విలువగు తమ
సాయమందింపవలె’ నని, ’సమయముఁ గొన
నర్హుఁ డీ’ వంచుఁ జెప్పితి నధిప, యేను! 5-58-134

వాలి హరియింప సుగ్రీవు ప్రభుత నంత,
నట్టి సుగ్రీవు తోడ మహాప్రభుండు
నైన శ్రీరామచంద్రుండు నగ్నిసాక్షి
గాను సఖ్యమ్ము నందెను ఘనముగాను! 5-58-135

ఆ రఘూత్తముం డనిలోన నద్వితీయ
మైన యేకాశుగముచేత నట్టి వాలిఁ
ద్రుంచి, వానరేంద్రుండునౌ ప్రొద్దుఁగుఱ్ఱఁ
డైన సుగ్రీవు నప్పుడు నధిపుఁ జేసె! 5-58-136

ఇపుడు మేము శ్రీరామక్షితీశునకును
నన్నివిధముల సాహాయ్యమందఁజేయ
వలసియుండుటచేతఁ బవనజు నన్ను
నంపెనయ రాజ, తాను ధర్మానుసృతిని! 5-58-137

వీర వానరుల్ నీ యొక్క వేలములను
నేలఁబెట్టకయ మునుపె నీవు తివిరి
సాదరముగ సీతామహాసాధ్వినిఁ దన
పతికి శ్రీరామునకు నిమ్ము త్వరితముగను! 5-58-138

ఎట్టి వానరుల్, పిలుచుచో ఋభువుల దరి
నరుగఁ గందురో, యట్టి వానరుల మహిమఁ
దెలియనట్టి వారెవ్వరు దివిని, భువినిఁ?
గాన, యోచింపుమయ్య శీఘ్రముగ నీవు! 5-58-139

కీశ రాజైనయట్టి సుగ్రీవుఁ డిటులు
నీదు మ్రోలనుఁ జెప్పఁ బనిచెను నన్ను!”
ననుచు రావణు నెదుట నే ననఁగ, నతఁడు
క్రుద్ధుఁడయి కాల్పఁ జూచెఁ జక్షుశిఖి నన్ను! 5-58-140

భీతకృతుఁడు, దురాత్ముండు, వేల్పుగొంగ
యైన రావణుండును నా మహత్త్వగరిమ
నెఱుఁగకయె, నన్ను సమయింప నెఱచిమేప
రులకు నాజ్ఞప్తి నిచ్చియుఁ బ్రోత్సహించె! 5-58-141

అంత రావణానుజుఁడు, మహామతియును
నౌ విభీషణ నాముఁడు నా విషయముఁ
గూర్చి యా దనుజాధిపుఁ గోరి మిగులఁ
బ్రార్థనము సేసెఁ గరుణ పెంపారఁగాను! 5-58-142

“ఓ యసురవృషభా! యిట్లు చేయఁదగదు!
నీదు నిశ్చయ మడఁపుము! నీతి వీడి,
రాజశాస్త్రవిరుద్ధమార్గమును ననుస
రించుచుంటివి రోషానఁ, బ్రేమ మఱచి! 5-58-143

ఓయి యసురేంద్ర! రావణ! యోయి యగ్ర
జా! యిదేమయ? రాజశాస్త్రములలోన
దూతలను వధించుట యన్న నీతి యేది
యేనిఁ గంటివె? దూత వచించు వచన
మందలి యథార్థమును నీవ యరయుమయ్య! 5-58-144

అతులవిక్రమ! యెంతటి యఘమునైనఁ
జేసినను, దూతలను నెప్డుఁ జిదుమకుండఁ,
దగిన రీతి వైరూప్యమందంగఁజేసి,
పనుపుటే న్యాయమని విధింపఁగఁబడెనయ!” 5-58-145

అనుచు నిటులు విభీషణుం డనఁగ, నపుడు
రావణుఁడు “వీని తోఁకను రగులుచున్న
జ్వాలతోఁ గాల్చివేయుఁడు త్వరితముగ!” న
టంచు రాక్షస భటులకు నాజ్ఞనిచ్చె! 5-58-146

అప్పు డా యానతిని విని యసుర భటులు
నాదు తోఁక కట జనపనార చీర
లఁ, జినిఁగిన నూలు వస్త్రమ్ములను మిగులఁగఁ
జుట్టఁబెట్టిరి కాల్పంగఁజూచుచు వడి! 5-58-147

అటు పిదప సర్వసన్నద్ధులయిన, చండ
విక్రములయిన దనుజులు, వేత్ర, ముష్టి
ఘాతములతోడ మోదుచుఁ, గదలకుండఁ
ద్రాళ్ళతో నాదు పుచ్ఛబంధమ్ముఁజేసి,
కాల్చిరయ తోఁకఁ ద్వరితమ్ముగాను నపుడు! 5-58-148

అంత శూరులౌ దనుజులు, నట్లు కట్టఁ
బడియు, నగ్నిచేఁ జుట్టంగఁబడిన నన్ను,
పట్టణద్వారపుం జేరువకునుఁ గొంచుఁ
బోయి, ననుఁగూర్చి యఱచిరి పురపథమున! 5-58-149

అంత నాదు మహద్రూప మపుడు నేను
చిన్నగాఁ జేసి, బంధంపు స్థితిని వీడి,
పూర్వ మున్నట్టులే యయి, పొంది పరిఘ,
నా దనుజులనుఁ జంపితి నతిరయమున! 5-58-150

పిదప నేను వేగమ్ముగా నా నగరపు
ద్వారము పయికి దుమికియుఁ, బ్రజ్వలించు
నట్టి తోఁకచే, బురుజులు నటులె గోపు
రములఁ గూడిన నగరమ్ముఁ బ్రళయకాల
వహ్ని వలె దహించితి నింత భయములేక! 5-58-151

’లంకయందునుంగల సకలప్రదేశ
ములును బుగ్గియైపోయెను; బుగ్గికాని
స్థలమె లేకుండెఁ; గాన, సీతయును దహన
మయ్యు నుండు’ నటంచు భయమ్ముగలిగె! 5-58-152

’కాలెఁ లంకయ, సీతయుఁ గాలియుండు;
నరమరయె లేదు; రాముని గురుతరకృత
మంతటిని నేను నిట్టులు వ్యర్థముగను
జేసితిని’ నంచు మదిఁ దలఁచితిని మిగుల! 5-58-153

ఈ విధముగ దుఃఖాక్రాంతునై విషాద
పడియు, “జానకియె దహియింపఁబడలే" ద
టంచు నచ్చెరు వంది, కథించుచున్న
చారణుల మంగళకర వచస్సు వింటి! 5-58-154

అచ్చెరువునందఁజేసెడి యట్టి మాట
లన్ని వినిన పిదప వేగ, ’నవని సుతయ
దగ్ధయయియుండ’ దనియెడి తలఁపు, నేను
సుశకునముఁగని యభినవించుకొనినాఁడ! 5-58-155

నాదు తోఁకయె రగులుచున్నను, ననలము
నన్ను దహియింపనేలేదు! నా హృదయము
కూడ సంతుష్టితో నుండె! గాడుపులును
సురభిళమ్ములం బ్రసరించుచుండెనపుడు! 5-58-156

పూర్వ శాకున సఫల సంస్ఫురణవిదిత
సద్గుణోపేత కారణస్థ ఫల సిద్ధి
కలుగు ఋషివాక్యములచేత, ఘనముగాను
సంతసించిన హిత మనస్సహితునైతి! 5-58-157

జానకీ పునర్దర్శన సఫలతఁ గొని,
యామె యనుమతి నందియు, నా పిదప, న
రిష్ట నగమును మఱల దర్శించుకొనియు,
మిమ్ము దర్శించుకొనెడి తమియును నెసఁగ,
నప్పు డెగురుట మొదలిడితయ్య మఱల! 5-58-158

పిదపఁ బవన సుధాకర వీతిహోత్ర
సిద్ధ గంధర్వ సేవిత స్తీర్విమార్గ
మాశ్రయించియు నేనిట నంచితముగ
మిమ్ము దర్శించితయ్య సంప్రీతితోడ! 5-58-159

రాఘవుని ప్రభావముచేతఁ, బ్రస్థితమగు
మీ ప్రతాపమ్ముచేత, సంప్రీతుఁడైన
భానుజుఁడగు సుగ్రీవుని పనుపునఁ జని,
యేన యీ కార్యమును ననుష్ఠించితినయ! 5-58-160

ఇదియు నంతయు నాచేత హితకరముగఁ
జేయఁబడెనయ్య తగినట్లు స్థిరముగాను!
పిదప మీచేత శేష ముత్ప్రేరితముగఁ
జేయఁబడుఁగాక చెలులార స్థిరముగాను!” 5-58-161

[ఇది వాల్మీకి విరచిత ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమ్మునకుఁ దెనుఁగు పద్యానువాదమగు మధుర రామాయణములోని సుందరకాండ మందలి యేఁబది యెనిమిదవ సర్గ సమాప్తము]


స్వస్తి



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి