5, జనవరి 2020, ఆదివారం

మధుర రామాయణము: ఆరణ్య కాండము - 48వ సర్గము

మధుర రామాయణము
ఆరణ్య కాండము - 48వ సర్గము

image of sita refuses ravana hd కోసం చిత్ర ఫలితం

[రావణుఁడు సీతకుఁ దన పరాక్రమమును వర్ణించి చెప్పుట. సీత వానిని భయపెట్టుట.]

ఇటులఁ బరుషమ్ముగా వచియించునట్టి
ధరణిజాతపైఁ గుపితుఁడై దశశిరుండు
ఫాలమందున బొమముడి  వైచి యామె
కిట్టు లుత్తర మ్మొసఁగెను బిట్టుగాను. 3-48-1

“చాన! వైశ్రవణుఁడు నాదు సవతి తల్లి
సుతుఁడు! నే రావణాఖ్యుండ! సురిఁగి పోని
బలపరాక్రమమహితుండఁ! బంక్తి కంఠ
యుతుఁడ! భద్రమగుం గాక, యతివ నీకు! 3-48-2

ప్రజలు మృత్యువునకు నెట్లు భయపడెదరొ,
యట్లె నిర్జరగంధర్వయక్ష గరుడ
నాగులందఱు సరగున నన్నుఁ జూచి
భయముచేఁ బాఱుటయ పరిపాటి సుమ్ము! 3-48-3

యక్షపతి కుబేరుఁడు కారణాంతరమునఁ
గుపితుఁడై ద్వంద్వయుద్ధానఁ గూల్పఁ గోరి,
నన్నుఁ బిల్చియు, నని సేసి, నను గెలువ న
శక్తుఁడై యోటమిం గొనె సమరమందు! 3-48-4

ఆ కుబేరుఁడు భయమంది, యఖిల సంప
దలకు నెలవైన నగరియౌ "యలక" వీడి,
పరమపదమగు కైలాస పర్వతమున
కేఁగి, నివసించుచుండెను హితముఁ గొనఁగ! 3-49-5

ఆ కుబేరుని చెంతను నలరునట్టి
పుష్పకవిమానమును నాదు భుజబలమునఁ
గొంటి! దాని పై నెక్కి యేఁ గోరు దెసకు
వేగ నేఁగెద నాకాశవీథిఁదేలి! 3-48-6

సీత, వినుము! నే కను లెఱ్ఱఁ జేసినంత,
నన్నుఁ గాంచి, యింద్రాదులు నడుఁకుఁ గొనియుఁ,
బాఱి చనెదరు! నేనున్న ప్రాంతమందు
గాలులను వీవ వెనుకాడు గంధవహుఁడు! 3-48-7

తపనుఁడే నాకు భయపడి తనదు వేఁడి
కిరణములఁ జల్లఁబఱచియుఁ బరఁగఁ జనును!
మ్రాఁకు లే నుండఁ గదలంగ మాను నపుడు!
నదులు ప్రవహింపకుండును నన్నుఁజూచి! 3-48-8

ఘోర రాక్షసాకీర్ణ సంకులమునయ్యు,
ననువులొల్కు  "లంకాపట్టణ" మను నాదు
రాజధాని, శక్రుని యమరావతి వలెఁ
దేజరిలుచుండె సాగరతీరమందు! 3-48-9

సుందరమ్మగు నా లంక చుట్టుఁ దెల్లఁ
గాఁ బ్రకాశించునట్టి ప్రాకారములును;
భర్మహర్మ్యాలు; వైడూర్యభరితములగు
ద్వారములు వెల్గుచుండు శాశ్వతముగాను! 3-48-10

అట్టి లంకాపురవరమ్ము హస్తి ఘోట
రథ విలసితమై యుండె సాంద్రముగ! నింక
వాద్యములు మ్రోసె! నిఁక నన్ని పాళములను
ఫలములిడు కుజమ్ములతోడ వనము మెఱసె! 3-48-11

రాజ పుత్రి! మనస్విని! రమణి సీత!
నీవు నాతోడఁ గలసియు నెయ్యమొప్ప,
నిట్టి లంకాపురిని నివసింపఁగాను,
మనుజ భామలు రారు నీ స్మరణమునకు! 3-48-12

జానకీ! దేవ మానవ సౌఖ్యములను
నీ వనుభవించుచును, నట నీ గతాయు
వైన రాముని స్మరియింపనైన వలవ
వెప్పు డీ సౌఖ్య మబ్బిన యెలమిచేత! 3-48-13

పంక్తిరథుఁడు స్వ ప్రియపుత్రు భరతు స్వీయ
రాజ్య పాలకుఁ గావించి, రాముఁ డీబ
రియు నగుడు, నట్టి జ్యేష్ఠుని, దయను వీడి,
వనములందుండ నంపెఁ గార్పణ్యమూని! 3-48-14

ఇటుల రాముండు రాజ్యబహిష్కృతుఁడయి
యుంటఁ, గర్తవ్య నిర్ణయ యుక్తిఁ గోల్ప
డియు, విరాగియు నయ్యు, నొందిలిని నొంది
యుండ, నతనితో నీ కేమి యొదవు ఫలము? 3-48-15

సకల రాక్షస ప్రభుఁడ, నే చైత్రసఖుని
బాణములచేతఁ బీడింపఁబడియు, మిగుల
కాముకుఁడనయ్యును స్వయముగాను నీదు
చెంత కేతెంచితి; నిరాకరింతె నన్ను? 3-48-16

సీత! నన్ను నిరాకరించియుఁ, బురూర
వసునిఁ బాదాభిహత్యుగాఁ బరిభవించి,
పజ్జఁ బరితాపమందిన స్వర్గవేశ్య
యూర్వశి పగిదిఁ, బరితాప మొందఁగలవు! 3-48-17

రమణి! మానవమాత్రుఁడౌ రాముఁ డెప్పు
డనిని నా వ్రేలితోఁ దూఁగఁ! డటులె నేను
నీ యదృష్టవశమ్మున నిన్నుఁ దవిలి
యుంటి! నంగీకరింపు మో యువిద నన్ను!” 3-48-18

అనిన రావణు మాటల నాలకించి,
క్రుద్ధసంరక్తనేత్రయై కుజయు విజన
దేశ మందున్న రాక్షసాధిపునితోడ
నిటులఁ బలికెను రోషాగ్నియెగసి యాడ! 3-48-19

“సకల జీవులచే నమస్కారమందు
ద్రుముని భ్రాతగాఁ జెప్పెడు దుండగీఁడ!
యీ యకార్యమ్ముఁ జేయంగ నెటుల నీవు
పూనుకొంటివో చెప్పుము ముందు నాకు! 3-48-20

రావణా! క్రూర! దుర్బుద్ధి! నీవ యింద్రి
యముల సంయమనము లేని యధముఁడవయ!
యిట్టి నిన్ను ప్రభునిగాను నెన్నినట్టి
సకల దనుజు లవశ్యమ్ము చావఁగలరు! 3-48-21

శక్రు భార్య యైనట్టి యా శచిని దొంగి
లించియును నీవు భువిని జీవించవచ్చుఁ,
గాని, రాముని సతినిఁ దక్కలి గొనియును
బ్రతికి నిలిచెదో భూమిపై రక్కసీఁడ? 3-48-22

సాటిలేనట్టి రూపసిన్ శచిని, నింద్రు
చెట్టనుం డీవు బలువిడి పట్టుకొనియు,
జీవనముసేయఁ గల్గుదు స్థిరముగాను!
కాని, నావంటి సతి దూఱి, ఘనతరమగు
నమృతమానినన్, మృతియె తప్పక నినుఁ గొను!" 3-48-23


[ఇది వాల్మీకి విరచిత ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమ్మునకుఁ దెనుఁగు పద్యానువాదమగు మధుర రామాయణములోని యారణ్య కాండ మందలి నలుబది యెనిమిదవ సర్గము సమాప్తము]

స్వస్తి


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి