5, జనవరి 2020, ఆదివారం

మధుర రామాయణము: కిష్కింధ కాండము – 56వ సర్గము

మధుర రామాయణము
కిష్కింధ కాండము – 56వ సర్గము

సంబంధిత చిత్రం

[సంపాతినిఁ జూచి వానరులు భయపడుట. జటాయువు మరణించినట్లు వానరులనుండి విని సంపాతి దుఃఖించుట. తనను క్రిందికి దింపుఁడని యతఁడు వానరులను ప్రార్థించుట.]

వానరులు సర్వులును గిరిప్రాంతమందుఁ
బూని ప్రాయోపవేశమ్ముఁ బొసఁగఁ జేయు
చుండ, నా పొంతనుం గల యండజ విభుఁ
డైన గృధ్రరా జేతెంచె నచటి కపుడు! 4-56-1

ఆ ఖగేంద్రుండు సంపాతి యనెడు పేరఁ
బరఁగుచున్నట్టి చిరజీవి; బలపరాక్ర
మములచే సుప్రసిద్ధుండు; మహిత గుణుఁడు;
నల జటాయువు సోదరుండయినవాఁడు! 4-56-2

అతఁడు వింధ్యపర్వతగుహయందునుండి
యుత్క్రమించియు, నచటఁ బ్రాయోపవిష్టు
లయిన వానరులఁ గని, హృష్టాత్ముఁడగుచు,
నిటుల వచియించె నప్డు స్వహితపరుఁడయి! 4-56-3

“ఇహమునందున దైవమ్ము హితకరముగఁ
బ్రాణులన్నిఁటి పూర్వకర్మానుసార
ఫలము లిడుచుండు; నటులె లబ్ధమ్మునయ్యె
నింతకాలమ్మునకు నాకు నెరయె యిచట! 4-56-4

ఇట్టి వానర పంక్తిలో నెవఁడు చచ్చు,
నట్టి వానిని భక్షింతు!” ననుచు వాన
రులనుఁ జూచుచుఁ దా నప్పు డలరి, పక్షి
పలికె నీ విధమ్మున, విన వానరు లది! 4-56-5

ఎరనుఁ దినునట్టి యాసక్తి యెక్కువ గల
గృధ్రవిభు వాక్కుల విని, మిక్కిలిగ దుఃఖ
మంది, యాంజనేయునితోడ నంగదుండు
నీ విధమ్మునం బలికెఁ దా నెదఁ గుములుచు! 4-56-6

“చూడు మో హనుమంత! యిచ్చోటికి యముఁ
డేఁగుదెంచెను, గృధ్రమన్ హేతువునను!
మననుఁ జంపి, కొంపోవ, యమపురి కిప్పు!
డిదియె కనుమయ్య పావని, యెదుట నీవు! 4-56-7

’రామకార్యము సాధింపరాని మనము,
రాజు నాజ్ఞను విడనాడి బ్రతుకవల’ ద
టంచు, నీ యాపదయె యేఁగుదెంచె నిటకు,
మనకు దెలియకుండంగఁ జయ్యనఁ బరుగున! 4-56-8

సీతకుం బ్రియ మిడఁగ నెంచిన జటాయు
వచట నేమి సేసెనొ మీకు బాగుగఁ దెలి
యును! సమస్త తిర్యగ్జంతుయూధములును,
ప్రాణములు లెక్కసేయక, రామునకును,
మనకు వలెఁ బ్రియమ్మును సేయ మలయుచుండె! 4-56-9

ఇలను నిఁకనుఁ దిర్యగ్జంతువులు చెలిమియుఁ,
గరుణ నిండినవై పరస్పర ముపకృతి
చేసికొనుచుండె; నందుచే స్థిరమతిఁగొని,
రామునకు నుపకృతి నిడఁ బ్రాణములను
మీర లిప్డు త్యజింపుఁడు మిన్నలగుచు! 4-56-10

ధర్మ మెఱిఁగి జటాయువు దాశరథికిఁ
బ్రియము నొనరించె; మనమునుఁ బ్రియ మొనరుపఁ
బ్రాణములకుఁ దెగించియు, రామునకయి
శ్రమఁ గొని యరణ్యమందున నెమకి నెమకి,
సీత జాడనుఁ గనకుంటి మీ తఱికిని! 4-56-11

యుద్ధమున శ్యైని, కైకసేయునివలనను
చంపఁబడి యదృష్టమ్మందె శాశ్వతముగ!
నతనికిని సౌరి వలన నే వెతయుఁ గలుగ;
దట్టులే యతం డందె మోక్షామృతమును! 4-56-12

దశరథుని మరణమ్ముచేతను, జటాయు
వధము వలనను, ధరణిజాపహరణమున
నిపుడు వానర యూధమ్ము లెంతయు ఘన
సంశయాత్మతం బొందె నిస్సంశయముగ! 4-56-13

రమణమీఱ సీతారామలక్ష్మణులును
నటవిలో వసియించుట; యటులె రాఘ
వోత్తమాగ్రహకృత దనుజోన్మథనము;
రామబాణాహతిన్ వాలి మ్రందుట; యివి
దశరథోద్దత్త కైకేప్సితంపుఁ గృతులె! 4-56-14

అనుచు దుఃఖాన హనుమతో నంగదుండు
పల్కు వచనముల్ వినిన సంపాతి మిగుల
భయమునందియు మనమున, రయముగాను,
దీనముగఁ బల్కె నిట్లు విధేయుని వలె! 4-56-15

తీక్ష్ణచంచువు, ఘననినదితుఁడునైన
గృధ్రరాజు సంపాతి, దుఃఖితుఁడు నయిన
యంగదునివాక్కులను విని, యా క్షణమున
నిట్లు పలికెను భయమెంతయేనిఁ గలుగ! 4-56-16

“మన్మనము కంపనము నంద, సన్మతియును,
నాదు ప్రాణాధికుండును, నాకు నిష్టుఁ
డును, మదీయ ప్రియానుజుండును నయిన జ
టాయు వధఁ గూర్చి పల్కువాఁడాతఁడెవఁడు? 4-56-17

ఆ జనస్థాన మందున నసురునకు జ
టాయువునకు యుద్ధమ్మెట్టులాయె? నిపుడు
నాదు సోదరు నామమున్ జాల కాల
మైన పిదప నే వినుచుంటి నకట, యిటుల! 4-56-18

అయ్య! నను మీరు గిరిదుర్గమందునుండి
క్రిందకును దింపఁ గోరెదఁ! బ్రియతముండు,
గుణయుతుఁడు, విక్రమముచేత గుఱుతుఁ గొనిన
వాఁడు నగు నా యనుజు నిట్లు పలు దినముల
పిదపఁ గీర్తింపఁ దుష్టి ప్రాప్తించె నాకు! 4-56-19

గురుజనప్రియుఁడు, వర రఘుకులజుండు
నైన రఘురాముఁ డెవ్వని యగ్రసుతుఁడొ,
యట్టి మత్సోదర సఖుండునౌ దశరథుఁ
డెట్లు మరణించెనో చెప్పుఁ డిపుడు నాకు! 4-56-20

ఓ యరిందములార! సూర్యోగ్రకిరణ
దగ్ధపక్షుఁడ నగుటఁ, గదల సమర్థుఁ
గాని కతమున మీ రీ నగమ్మునుండి
నన్ను దింపఁగోరెదను వినమ్రుఁడనయి!” 4-56-21


[ఇది వాల్మీకి విరచిత ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమ్మునకుఁ దెనుఁగు పద్యానువాదమగు మధుర రామాయణము లోని కిష్కింధ కాండ మందలి యేఁబది యాఱవ సర్గము సమాప్తము]

స్వస్తి


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి