5, జనవరి 2020, ఆదివారం

మధుర రామాయణము: బాలకాండము-57వ సర్గము

మధుర రామాయణము

బాలకాండము-57వ సర్గము
 


[విశ్వామిత్రుఁడు తపస్సు చేయుట. సశరీరస్వర్గముం బొందుటకై తనచే యజ్ఞముం జేయింపవలెనని త్రిశంకువు వసిష్ఠునిఁ బ్రార్థించుట. ఆతఁ డందులకు నిరాకరింపఁ, ద్రిశంకుఁడు గురుపుత్రుల యొద్దకుఁ బోయి, తన యభిప్రాయముం దెలుపుట.]
 
అంత, నో రఘురామ! మహాత్ముఁడైన
యా వసిష్ఠునితోనున్నయట్టి వైర
కారణమునఁ గౌశికుఁడు నిగ్రహ హృదుండు
నగుచు నవమాన భారాన నలమటించె! 1-57-1
 
మాటిమాటికి నిట్టూర్చి, మనమునందుఁ
గుందుచును, జ్యేష్ఠ భార్యతోఁ గూడి, దక్షి
ణంపు దెసఁ జని, చేసె ఘోరంపుఁ దపముఁ;
గొనుచు ఫలమూలముల, దాంత గుణుఁడు నగుచు! 1-57-2
 
అట మధుస్యందుఁడును హవిష్యందుఁడు దృఢ
నేత్రుఁడు మహారథుండను స్నిగ్ధ సుగుణ
సత్యధర్మ పరాయణ సహితులైన
సుత చతుష్కము జన్మించె సుకృతబలిమి! 1-57-3
 
అతని తపమును వర్షసహస్రపూర్ణ
మైన యంతఁ, బితామహుండైన బ్రహ్మ,
కూరిమి మెయి, విశ్వామిత్రుఁ గూర్చి, మృదు మ
ధుర వచనముల నిటు వల్కెఁ దుష్టిఁ గొనియు! 1-57-4
 
“కుశిక నందన! నీ తపస్స్పశముచే గె
లువఁగఁబడెనయ్య రాజర్షిలోక మిలను!
సంయతి ప్రభావమున “రాజర్షి” యనియు
నిన్ను గుర్తించు నీ లోక మున్నతునిగ!” 1-57-5
 
అనుచు నా మహా తేజస్వి, యఖిలలోక
నాథుఁడౌ బ్రహ్మ, వర మిడి, నాకసదులు
వెనుకొనఁగ, బ్రహ్మలోక త్రివిష్టపమ్ముఁ
గూర్చి వెడలెను శీఘ్రమే కొమరు మిగుల!  1-57-6
 
అనఁగ వినియు విశ్వామిత్రుఁ డజుని వాక్కు,
హ్రీ మనస్కుఁడై, తలవంచి, యెసఁగు దుఃఖ
బలిమిఁ, గోపమ్ము హెచ్చంగఁ బటపటమని
పండ్లు గొఱుకుచు నిట్లనెఁ బరిభవుఁడయి! 1-57-7
 
’ఇంత ఘనమైన తపము నే నిచటఁ జేసి
నను, సురలు, ఋషిగణములు నన్ను నేఁడు
నిటుల “రాజర్షి”గఁ బరిగణించుచుంటఁ
గనఁగ, నా తపమ్ము వృథయగాఁ దలఁచెద!’ 1-57-8
 
అని మనమ్మున నిశ్చయించిన ప్రథితుఁడు,
విబుధుఁడౌ కౌశికుండు తద్విధినిఁ దలఁచి,
మఱలఁ దీవ్రంపుఁ దపము సమ్యగ్విధమునఁ
జేయఁగా రామ! మొదలిడె స్థిరముగాను! 1-57-9
 
ఇట్టు లాతఁడు తపమాచరించు తఱిని,
సత్యవాది, సంయమనుఁ, డిక్ష్వాకువంశ
వర్ధనుఁ డయి, “త్రిశంకు” గాఁ బ్రథితుఁడైన
పాలకుఁ డొకండు వసుధను నేలుచుండె!1-57-10
 
’యజ్ఞ మొనరించి, రామ! దేహమ్ముతోడ
స్వర్గ పదమునుఁ బొందంగ వలె’ ననుచు హృ
దిని నతనికిని నొకనాఁడు తిరుగులేని
తీవ్ర సంకల్ప ముదయించె దిటవుగాను! 1-57-11
 
అంత నతఁడు మహాత్ముండునౌ మునియగు
నా వసిష్ఠునిఁ బిలిపించి, యాత్మకాంక్షఁ
దెలుపఁగా, నాతఁ డద్దానిఁ దీర్పఁగాను
తన కసాధ్యమ్మటంచును వినిచె నయ్య! 1-57-12
 
అట్టు లా వసిష్ఠునిచే నిరాకరింపఁ
బడిన యా రాజు, దక్షిణ ప్రాంతమునకుఁ
జనియు, మదిలోనఁ దనదు కర్జము ఫలింపఁ
గడఁగుదు రని వాసిష్ఠుల కడకు వెడలె! 1-57-13
 
దీర్ఘ తపమొనర్చినయట్టి దిట్టలైన,
ధీ విశిష్ట వాసిష్ఠు లే దెసను గలరొ,
యచటికిం జనియుఁ ద్రిశంకుఁ డచట మహిత
భాసమాన యశస్క తాపస వసిష్ఠ
సూనులనుఁ గాంచె, నూర్వుర, శుభకరముగ! 1-57-14
 
అట్టు లతఁడు మహాత్ములునౌ గురుసుత
శతిఁ గదిసి, వయఃక్రమగతిఁ జాఁగిలఁబడి,
సిగ్గుచేఁ గొద్దిగఁ దలవంచి, వెస దోయి
లించి, తన్మహాత్ములతోడ నిట్లు పలికె! 1-57-15
 
“శరణు కోరి వచ్చిన నేను, శరణ మిడెడు
మిమ్ము శరణు పొందుచునుంటి సుమ్ము! మీకు
భద్ర మగుఁ గావుత! వసిష్ఠు వలన నాదు
కోరికయె నిరాకృతమయ్యెఁ; గుతుక మెసఁగె! 1-57-16
 
నే మహాయజ్ఞ మొకదాని నిర్వహింపఁ
గాంక్షితుఁడ! నట్టి కతమునఁ గట్టడి నిడ
మీరలే తగియుంటిరి! మీ గురుసుతు
లందఱకు నమస్కృతు లిత్తు నందుకొనుఁడు! 1-57-17
 
తప మొనర్చెడి బ్రాహ్మణోత్తములు మీరు!
మీకుఁ దలవంచి ప్రణమిల్లి, పోక, ప్రార్థ
నమ్మిడెద, సశరీరుగా నాకమునకు
నంప నను మీర! లే నది యందుటకయి,
యజ్ఞ మొనరింప సావధా నాత్ము లగుఁడు! 1-57-18
 
ఓ తపోధనులార! మహోన్నతుఁడగు
ముని వసిష్ఠుని ధిక్కృతిఁ బొంది, యేను
సకల గురుపుత్రులగు మీరె శరణ మనుచు,
వచ్చితిని! నాకు గతి మీరె! పరులఁ గనను! 1-57-19
 
అడర నిక్ష్వాకు వంశజు లందఱ కిల
ఘన పురోహితుల్ వర గతి కాదె! యట్టి
బుధులు విద్వాంసు లెల్లప్డు భూమి పతుల,
సంసృతి జలధిఁ దరియింపఁ జాలుదురయ!
యతి వసిష్ఠుని పిదపఁ బూజితుల రీరు!" 1-57-20
 
[ఇది వాల్మీకి విరచిత ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమ్మునకుఁ దెనుఁగు పద్యానువాదమగు మధుర రామాయణములోని బాలకాండ మందలి యేఁబది యేడవ సర్గ సమాప్తము]

స్వస్తి


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి