5, జనవరి 2020, ఆదివారం

మధుర రామాయణము: బాలకాండము-49వ సర్గము

మధుర రామాయణము
బాలకాండము: 49వ సర్గము:
Related image

[శాపముచే నండములు పోయిన యింద్రునకుఁ బితృదేవతలు మేషాండములఁ గూర్చుట. శ్రీరాముఁ డహల్యను శాప విముక్తురాలినిఁ జేయుట. అహల్యాగౌతములు శ్రీరాముని సత్కరించుట]


ముష్కహీనతచేఁ ద్రస్తముఖుఁడునైన
శక్రుఁ డంతట ఋషిసంఘ సహితులునగు
చారణులతోడఁ గూడిన జ్వలనుఁడు మొద
లయిన సురలతో నిట్టుల ననియె నపుడు. 1-49-1

“మాన్యుఁడౌ గౌతమునకు నామర్షము నిడి,
యతని తపమునకును విఘ్న మందఁజేసి,
యేను దేవతా కార్యమ్ము నిట్లొనర్పఁ
జాలితిని గదా సురలార సాంతముగను! 1-49-2

అతనిచే నేను ముష్కహీనతనుఁ గంటి,
నా యహల్యయు ధిక్కృత యయ్యె; నిట్టు
లతఁడు గొప్ప శాపము నిచ్చునట్టు లేను
చేసి, యతని తపము హరించితిని గాదె! 1-49-3

కాన, ఋషిసంఘ చారణగణ విశిష్ట
యుక్త సురలార! మీరలే యొప్పుగాను
దేవ కార్యమ్మొనర్చు నా దిటవునుఁ గని,
నాకు వృషణముల్ వచ్చెడు పోకఁ గొనుఁడు!” 1-49-4

అను శతక్రతు వాక్కుల నప్పు డగ్ని
మొదలుగాఁ గల సురలు సముత్సుకతను
విని, మరుద్గణములతోడ వెడలియుఁ, బితృ
దేవతల కీ విధిని నివేదించి రంత. 1-49-5

ఇచటి మేషమ్ము వృషణ సహితయ; యటులె,
శక్రుఁ డవృషణాకృతుఁడయ్యె శాశ్వతముగఁ;
గాన, మేషంపు వృషణ సద్గ్రాహకులయి,
శక్రునకు నిండు పితలార సరభసమున! 1-49-6

అఫలకృతమేష మిదె మీకు నమితమైన
తుష్టి దాయకమ్మగుఁ గాదె ద్రుతముగాను!
దాని నిడు మానవుల కట్లె త్వరితముగను
హర్ష దాయకమ్మగుచుండు ననవరతము!” 1-49-7

అనిన యగ్ని మాటలు వినినట్టి పితరు
లందఱును జేరి, యజమున కమరి యున్న
వృషణ యుగ్మమ్ముఁ బెకలించి, వేగిరముగ
నంటఁ జేర్చి రంతట సహస్రాక్షునకును! 1-49-8

రామ! తచ్ఛాగ వృషణమ్ముల నటు లింద్రు
నకునుఁ గూర్చిన కతమున, నాఁటినుండి
తగిన రీతినిఁ బితరులందఱును విగత
వృషణ మేషమ్ములను భుజియించుచుండ్రి! 1-49-9

అది మొదలు, రామచంద్ర! మహర్షియైన
గౌతముని ప్రభావముచేత గట్టుదాయ,
మేషవృషణమ్ములం గల్గి మెలఁగుచు, సుర
లోక మేలుచునున్నాఁడు శోకము విడి! 1-49-10

మహిత తేజస్వి! రఘురామ! మాన్యుఁడైన
పుణ్యకర్ముఁడౌ గౌతమ ముని గృహమున
దేవరూపిణియగు మహాదివ్యభాగ
నా యహల్యనుం దరియింపఁ జేయ రమ్ము!” 1-49-11

అంచుఁ బల్కు విశ్వామిత్రు నాదరంపు
టానతిం దలఁ దాలిచి, యనుజు తోడ
ముని పురస్కృతుం డగుచు రాముండు సాఁగి,
యాశ్రమమునం బ్రవేశించె నతి ముదమున! 1-49-12

మహితభాగ; తపఃప్రభామయసుదీప్త;
ద్యుసద రాక్షస మానవ దుర్నిరీక్ష్య;
బ్రహ్మసద్యత్నజన్య; దివ్య; భ్రమామ
యాకృత;  తుహినపరివృతాహార్యయుక్త
సాభ్రపూర్ణచంద్రప్రభాసమవికాస; 1-49-13

స్తీర్విమధ్యస్థి తాతిరస్కృత మయూఖ
హర్ష సందీప్త సూర్యప్ర భాభవిశద
యైన యా యహల్యనుఁ గాంచె నపుడు రాఘ
వాఖ్యుఁ డయినట్టి శ్రీరాముఁ డాదరమున! 1-49-14

రామ దర్శన మ్మగుదాఁక, రామయైన
యా యహల్యయె, లోకత్రయాధివాసు
లెవ్వరికిఁ గూడఁ దా దుర్నిరీక్ష్యయగుచు,
గౌతముఁడు చెప్పినటులే ప్రకాశ్యయయ్యె! 1-49-15

శాప పరిసమాప్తిని నొంది స్వచ్ఛయగుడు
నా యహల్యయుఁ గనిపించె నన్నదమ్ము
లైన రామలక్ష్మణులకు; నంత వార
లామె పదపద్మసద్గ్రాహ్యులయిరి మ్రొక్కి! 1-49-16

ఆ యహల్యయు ఋషివాక్కు లాలకించి,
రామలక్ష్మణులకు సగౌరవముగాను
స్వాగతము వల్కి, పాద్యార్ఘ్య సవిధి సాత్కృ
తాతిథేయమ్ము నిడ; రాముఁ డది గ్రహించె! 1-49-17

దేవతలు దుందుభులు మ్రోసి, దివ్యపుష్ప
వృష్టిఁ గురియింప, గంధర్వు లిష్టపూర్ణ
గేయములు పాడ, నచ్చరల్ గేయములకుఁ
దగిన నాట్యమ్ము సలిపిరి తన్మయతను! 1-49-18

గౌతమాజ్ఞానుసారిణి, ఘనతపోగ్ర
బలవిశుద్ధాంగి యైనట్టి యల యహల్యఁ
గాంచి దేవత లందఱు ఘనముగాను
సాధువాక్యాల మెచ్చి, పూజనము లిడిరి! 1-49-19

ఘనతపశ్శాలి, తేజస్వి గౌతముండు
భార్యయౌ యహల్యనుఁ గూడి, ప్రమదమంది,
శాస్త్రవిధిని శ్రీరాముని సంస్తుతించి,
మున్నువలె తపమ్మొనరింపఁబోయె నపుడు! 1-49-20

అంత శ్రీరామచంద్రుండు, హర్షమునను
గౌతముం డొనర్చిన పూజ, ఘనయుతమగు
శాస్త్రవిధిఁ గొని, మునితోడ సరభసమున
వెడలె మిథిలకుఁ దమ్ముఁడు వెంటరాఁగ! 1-49-21

[ఇది వాల్మీకి విరచిత ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమ్మునకుఁ దెనుఁగు పద్యానువాదమగు మధుర రామాయణములోని బాలకాండ మందలి నలుబది తొమ్మిదవ సర్గ సమాప్తము]

స్వస్తి



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి