5, జనవరి 2020, ఆదివారం

మధుర రామాయణము: ఉత్తరకాండము - 29వ సర్గము

మధుర రామాయణము
ఉత్తరకాండము - 29వ సర్గము

image hd ravana కోసం చిత్ర ఫలితం

[రావణుఁడు దేవతల సైన్యమునుండి బయటకుఁ బోవుట. అతనిఁ బట్టుకొనుటకై దేవతలు ప్రయత్నించుట. ఇంతలో మేఘనాదుఁడు మాయా ప్రయోగముచేత నింద్రుని బంధించి, విజయవంతుఁడై సైన్యముతో లంకకుఁ బ్రయాణమగుట]

అంతఁ దిమిరాక్రమితకాలమం దమరులు,
రాక్షసులు చెలరేఁగి పరస్పరమ్ము
బలమదోన్మత్తులై నశింపంగఁజేసి
కొనుచు యుద్ధ మ్మొనర్చిరి కుపితు లగుచు! 7-29-1

ఆ మహాయుద్ధమందున నసుర కలిత
మౌ బృహత్సైన్యమందు, దశాంశ మచట
శేష మగునట్లు ఖచరులు సేసి, మిగిలి
నట్టి సైన్యమున్ యమపురి కంపి రపుడు! 7-29-2

అంధకారావృతంపు జన్యమ్మునందు
దేవరాక్షసు లొండొరుల్ ద్రెక్కలిగొను
చుండ్రిగాని, పరస్పర సూక్ష్మదృక్కుఁ
బఱపి పరిపంథి నెఱుఁగంగ వలవరైరి! 7-29-3

అంధకారబంధురమగు నా దురమున
బల్లిదుండ్రౌ త్రితయ వీర వరులునైన
యింద్రజిద్రావణేంద్రులే యెట్టి మోహ
జాలమందుఁ జిక్కకయుండ్రి సర్వులందు! 7-29-4

అంత నా రావణుఁడు తనవైన బలము
లన్ని క్షణకాలమందున నంతమగుటఁ
గనియు, నాగ్రహోదగ్రుఁడై, ఘనము గాను
సింహగర్జన సేసె నా చివ్వయందు! 7-29-5

పిదప దుర్ధర్షుఁడౌ సురద్విషవిభుండు
క్రోధమున రథసారథిం గూర్చి యిటులఁ
బలికె “రథముఁ, బ్రతిద్వంద్విపక్షమంత
నాశమౌ దాఁక, నడుమన నడుపుమయ్య! 7-29-6

ఇప్పు డేను స్వయముగ ననేకవిధము
లైన శస్త్రసారముతోడ, నమర వితతిఁ
జంపి, యమలోకముం జేర్తు, శౌర్యము వెలుఁ
గొందు నట్టులఁ బోరున నుద్యమించి! 7-29-7

నేన స్వయముగా యుద్ధాన నిక్కముగను
యమవరుణధనదేంద్రుల హతమొనర్చి,
పిదప దేవత లందఱ బెండుపఱచి,
పరఁగ ముల్లోకములకధిపతినగుదును! 7-29-8

’విమత తతి మధ్య రథచోదన’ మని భయము
నందకుము! శీఘ్రముగఁ ద్రోలు మరద మిపుడ!
మఱలఁ జెప్పెద, రథము, విమత నిచయము
నాశమౌదాఁక, నడుమన నడుపుమయ్య! 7-29-9

వినుము! మనమున్న యిద్ది నందనవనభువి!
కనఁగ సురసేన యుదయాద్రి కడ దనుకను
వ్యాప్తమైయుండెఁ! గానఁ, దత్పర్వతమ్ము
దాఁక విజయింతుఁ, గొనిపొమ్మ త్వరితముగను!” 7-29-10

అనిన రావణు వచనమ్ము లాలకించి,
వెసను రథసారథియు మనోవేగముగల
తురగములఁ బూన్చినట్టి యా యరద మపుడ
శత్రుమధ్యదేశమునకుఁ జాఁగఁ ద్రోలె! 7-29-11

అపుడు దేవేశ్వరుండైన యద్రిభిదుఁడు,
రావణుని నిశ్చయము విని, రణభువిఁ గల
రథమునందుండి, యచటి నిర్జరులతోడఁ
దనదు వ్యూహమ్ము నిట్టులఁ దగఁ బలికెను! 7-29-12

“వినుఁడు సురలార! యెయ్యది ప్రియము నాకుఁ
గూర్చునో, యట్టి వాక్యమ్ముఁ గూర్చి మీకుఁ
జెప్పెదను! పంక్తికంఠు సజీవునిగను
బంధితునిఁ జేయవలెను గీర్వాణులార! 7-29-13

కడు బలాధికుఁడగు దశకంఠుఁడు రథ
మందు నారూఢుఁడై వచ్చి, మనపయిఁబడి,
పౌర్ణమిని విజృంభించెడి వారినిధి ల
హరిని వలె విజృంభించి, నుగ్గాడఁగలఁడు! 7-29-14

వరబలోన్నతాభయుఁడైన వానిఁ జంప,
మన మశక్తుల మగుదుము! కనుక, వాని
సంయుగమ్మున బంధింపఁ జక్కనయగుఁ!
దత్ప్రయత్నమ్మునకు మీరు తరలుఁడయ్య! 7-29-15

బలినిఁ బాతాళమున హరి బంధితునిగఁ
దగ నొనర్పఁగ, నేను ముజ్జగము లనుభ
వించుచున్నట్లు, పాపాత్ము వీని నటులె
బంధితునిఁ జేయవలెనని పలుకుచుంటి!" 7-29-16

వేలుపులతోడ నిట్లని వేలుపుదొర,
బంతిమోములదొరతోడి బవరము విడి,
వేరు తలమునకుం జని, బీతు గలుగఁ
బోరు మొదలిడె రక్కసి మూఁకతోడ! 7-29-17

అని నివర్తితుఁడుం గాక యాశిరపతి,
యుత్తరమునుండి చొఱఁబడఁ దత్తబడను,
నతనిఁ గనుచును నిఁక సహస్రాక్షుఁ డంత,
క్షిప్రమే ప్రవేశించె దక్షిణమునుండి! 7-29-18

అంత యోజనశతదూర మాశిరపతి,
దివిజ సైన్యానఁ జొచ్చియు, స్థిరబలయుతుఁ
డగుచు, వారలపయిని శస్త్రాస్త్రవర్ష
మునుఁ గుఱియఁజేసెఁ, జీకాకుఁ గొనఁగఁ జేసి! 7-29-19

అపుడు శక్రుండు తనసేన లంతమగుటఁ
గనియు, విభ్రాంతి నందక, వెనుకనుండి
వచ్చి, రావణు ముట్టుకోల్పఱచి, యుద్ధ
విముఖుఁ గావించె సరగున విక్రమించి! 7-29-20

ఇవ్విధమ్మున దైత్యేంద్రు నింద్ర శౌర్య
గ్రస్త దుస్థితి నీక్షించి రాక్షసులును,
దనుజు లపుడు “హా! చచ్చితి” మనెడి ధ్వనులు
వెడలఁ గ్రక్కిరి యగ్రోగ్రవిగ్రహమున! 7-29-21

అంతఁ గ్రోధసమ్మోహితుం డయిన మేఘ
నాదుఁ డత్యాగ్రహమున స్యందనము నెక్కి,
యతిభయంకర సురసైన్యమందు, మిగుల
వడిగఁ దాఁ బ్రవేశించెను బడలువాప! 7-29-22

తనకుఁ దొల్లి ముక్కంటి యిచ్చిన వరమగు
మాయనుం బూని, యతఁడు సంరంభమునను
దేవతల సైన్యమునఁ దూఱ, దివిజు లపుడు,
సమర రంగమ్మువిడి, పాఱి, చనిరి వేగ! 7-29-23

పాఱిపోయెడి సైన్యమున్ వదలి, యతఁడు
దేవతలఱేనిఁ గూర్చియుం బోవ, నపుడు
మిగుల తేజస్వి బలశాలియగు మఘవుఁడు,
తనదు రిపుసూను నచ్చటఁ గనుఁగొనఁడయె,
నింద్రజిచ్ఛాంబరీకృతసాంద్రమహిమ! 7-29-24

ఘనబలాఢ్యులు నగునట్టి దనుజ రిపులు,
ముక్త కవచుఁడౌ రావణిన్ మొత్తినను, న
తండు, వారల కేమియు దబ్బ ఱిడక,
భయము నందక నిలిచెను భండనమున! 7-29-25

అప్పు డా మేఘనాదుండు, నమర విభుని
సారథియగు మాతలి నట శరవరతతి
చేతఁ బ్రహరించి, యటులె వజ్రిపయిఁగూడ
బాణవర్షమ్ముఁ గుఱిపించె హృణిపెనుపున! 7-29-26

పిదప శక్రుండు రథమును విడచి, యటులె
సారథినిఁ బంపి, సితసామజప్రభు పయి
నధివసించి, రావణికయి, యచట నిచట
వెదుకఁ దొడఁగె, నాతనియొక్క బేలు కతన! 7-29-27

అతఁడు మాయా బలముచేత నచటఁ గానఁ
బడకయున్నట్టివాఁడయి, యుడుపథమ్ముఁ
జేరి, హరిని మాయాపరిక్షిప్తునిగను
జేసి, శరవర్షియై పర్వె శీఘ్రముగను! 7-29-28

కొంత వడికి రావణియె, శక్రుఁ డలసెనని
తెలిసి, తన మాయచేత బంధించి, పిదపఁ,
దనదు సైన్యమ్ము చెంత కాతనినిఁ దీసి
కొని వెడలెఁ, దాను వీరత్వమున నడరుచు! 7-29-29

అటుల వానిచే ఘన రణమందునుండి,
బలిమిఁ గొంపోవఁబడు నింద్రుఁ బరఁగఁ జూచి,
యమరు, “లేమగునో గదా!” యని మనములఁ
జింతనము సేయఁ దొడఁగిరి చేష్టలుడిగి! 7-29-30

“అసురు లందఱి మాయల నణఁచునట్టి
విద్య గల యింద్రునిం బట్టి, వెంటఁగొనుచుఁ
బోవు మాయావి, రావణు పుత్రుఁ, డిచట
నగపడుట లేదె!” యంచుఁ దా మనుకొనిరయ! 7-29-31

ఇటులఁ దలఁచుచు దేవతాపటలి మిగులఁ
బ్రతిఘమునుఁగొని, యప్పుడు రావణు పయి,
రణ విముఖుఁడునౌనటుల, మార్గణపు వృష్టిఁ
గుఱియఁజేసెను మిగులంగఁ, గోరి యనిని! 7-29-32

రావణుం డని, నాదిత్యులను, వసువుల
నెదురుకొనియును, వారిపై నెగ్గలేక,
వారి చేతను బీడింపఁబడుచు, బవర
మొనరఁ జేయఁజాలకయుండెఁ, గనఁగ నపుడు! 7-29-33

మిగుల మ్లానుఁడై, యుద్ధానఁ బగఱచేత
దెబ్బతిన్నట్టివాఁడునై, దీనముగను
నున్న తండ్రిని వీక్షించి, యుగ్రుఁడగుచు,
నింద్రజి చ్ఛాంబరిని వీడి, యిటులఁ బలికె! 7-29-34

“పోయెదము రమ్ము, తండ్రి! యీ పోరునాపి!
మనకె విజయమ్ము లభియించెనని తెలియుము!
స్వస్థుఁడవు కమ్ము, మనమున వ్యథలు నన్ని
తొలఁగి చనునట్లు, సంతస మొలుక నీవు! 7-29-35

అమరులకు, ముజ్జగములకు నధిపతియగు
వజ్రి, నమర సైన్యము నుండి బంధితునిగఁ
బొనరిచియు, దేవతల గర్వములును దొలఁగు
నట్లు సేసితి యుద్ధమ్మునందు నేను! 7-29-36

తండ్రి! యిఁక నీవు మండ్రాటకాండ్ర, నీదు
తేజ మలరఁగ నణఁచియుఁ, దిరముగాను,
మూఁడు లోకాల ననుభవింపుమయ! యిప్డు
వ్యర్థమైనట్టి యుద్ధంపు టలుపు లేల?” 7-29-37

ఇంద్రజి ద్వాక్యములు విని, ఋభువు లపుడు,
పెనఁకువల నుండి విరమించి, వెనుదిరిగిరి!
ప్రభుఁడు దేవేంద్రుఁడే లేని వార, లటులఁ
గాక, మఱియె ట్లొనర్తురు కదనమందు? 7-29-38

అనివిగతుఁడు, నుత్తమతేజుఁ, డమరవైరి,
సుప్రసిద్ధుఁడౌ రాక్షసేశుండు, తనదు
నాత్మజుఁడు వల్కు ప్రియవాక్కు లన్ని వినియు,
మన్ననల మాటలను నిట్లు సన్నుతించె! 7-29-39

“అతిబల! ప్రభు! నీదు పరాక్రమమున,
నాదు కులవంశవృద్ధినొందంగఁజేసి;
తిప్పు డతులబలుండవై, యిట్టి యింద్రు,
నటులె త్రిదశుల గెలిచితి వయ్య నీవు! 7-29-40

వత్స! నీవిప్డు రథమందు వాసవు నధి
రోపణముఁజేసి, సేనతోఁ, బ్రోలికరుఁగు;
మేను మన్మంత్రిసహిత సంహృష్టుఁడనయి
శీఘ్రమే వత్తు నీ వెన్క, జితమహేంద్ర!” 7-29-41

అనఁగ, వీరుఁ డా రావణి, యమరవిభునిఁ
గొని, బలవృతుఁడై, తనదు భవనముఁగూర్చి,
వాహనమునందుఁ గూర్చొని, ప్రమదముననుఁ
జనియు, దనుజులఁ దమ యిండ్లకును బనిచెను! 7-29-42

[ఇది వాల్మీకి విరచిత ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమ్మునకుఁ దెనుఁగు పద్యానువాదమగు మధుర రామాయణములోని యుత్తరకాండ మందలి యిరువది తొమ్మిదవ సర్గము సమాప్తము]

స్వస్తి


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి