5, జనవరి 2020, ఆదివారం

మధుర రామాయణము: బాల కాండము - 59వ సర్గము


మధుర రామాయణము
బాల కాండము - 59వ సర్గము

 సంబంధిత చిత్రం

[విశ్వామిత్రుఁడు త్రిశంకువునకు ధైర్యము చెప్పి, యాతనిచే యజ్ఞముం జేయించుటకై ఋషుల నాహ్వానించుట. తనను నధిక్షేపించిన మహోదయుని, వసిష్ఠ పుత్రులను శపించుట.]
 
పూర్ణ చండాలరూపుఁడౌ భూపు వాక్కు
లాలకించియుఁ, గృపతోడ నపుడు మౌని
యైన కుశికాత్మజుండనె నతి మృదు మధు
రంపు వాక్యాలఁ బ్రభువున కింపెసఁగఁగ! 1-59-1
 
“ఓయి యిక్ష్వాకు వంశ్య! సంస్తూయమాన!
వత్స! నీకు స్వాగతము! నీవ వర ధార్మి
కుండ వంచు నే నెఱుఁగుదు గుఱుతు సేసి!
భయము వలదయ్య! నే నీ కభయ మొసఁగెద! 1-59-2
 
అధిప! పుణ్యాత్ములైన మహర్షుల నిట
యజ్ఞ మొనరించుపట్ల సాహాయ్యమిడఁగ
స్వాగతింతును! నిర్వృత వదనుఁడవయి
నీవు యాగముం జేయుము నిశ్చయముగ! 1-59-3
 
గురు సుతుల శాప వశమునఁ గొనినదైన
యెట్టి రూపమ్ము నీ చేత నిపుడు పొందఁ
బడియు నున్నదో, యట్టి యీ శ్వపచ రూప
ముననె చనెదవు, సశరీరముగను దివికి! 1-59-4
 
రాజ! యిదె శరణాగత త్రాణుఁడనగు
నన్నుఁ గుశికాత్మజుని శరణమ్మునంది
నట్టి కతమున, దివి నీదు హస్తమునకు
నంది నట్టులే తలఁచెద నయ్య యిపుడు!” 1-59-5
 
అని మహాతేజుఁడౌ కుశికాత్మజుండు
పలికి, యజ్ఞ సంభార సంపాదనకయి,
పరమ ధార్మికులును, మహాప్రాజ్ఞులైన
పుత్రులకు నాజ్ఞ నొసఁగెను ముదముతోడ! 1-59-6
 
శిష్యులందఱఁ జేరఁ బిల్చియును “పోయి
రండు నాయనలార, మత్ప్రైషణఁ గొని!
శిష్య సఖ బహుశ్రుతయుతర్షిగణములను
తీసికొని రం” డటంచు నాదేశ మిడియు! 1-59-7
 
“నాదు సందేశము విని, యనాదృతియుత
వాక్యములను నెవ్వారలు వక్కణింతు,
రట్టి వాక్యమ్ములను వివరమ్ముగాను
చెప్పవలె మీర లిట నాకు శీఘ్రమె!” యనె.! 1-59-8
 
అంత శిష్యులు గాధిజు నానతిఁ గొని,
నలు దెసలఁ జని, పిల్వఁగా, నచటి బ్రహ్మ
వాదులైనట్టి ఋషులంత త్వరితముగను
వివిధ దేశాగతులునయ్యు విడిసి రచట! 1-59-9
 
తిరిగి వచ్చిన శిష్యులందఱును జ్వలిత
తేజుఁ డౌ కౌశికున కప్డు తిరముగాను
పరమ వేదాధ్యయన సుసంపన్నులయిన
బ్రహ్మవాదుల వాక్యమ్ములం దెలిపిరి! 1-59-10
 
“ఆర్య! మీ మాట వినియు బ్రాహ్మణులు సకలు
రిటకు వచ్చుచున్నారు మునీంద్ర వడిని!
స్వయ ముపేక్షచే నా మహోదయుఁడు తక్కఁ,
దక్కు ద్విజు లేఁగుదెంచిరి త్వరితముగను! 1-59-11
 
సకల ముని పుంగవ! సమస్త శత వసిష్ఠ
సుత సమూహము నీ వచస్సు విని, వినుచు
క్రోధపర్యాకులాక్షరోక్తులు సకలము
నీకు వినిపింతు మిప్డు మునీ, వినుమయ! 1-59-12
 
క్షత్రియుని యాజకునిగాను కాంక్షఁ గొనుట,
యదియుఁ గాక, చండాలుండు నందఁజేయు
నట్టిదౌ హవిస్సును సురల్ యతులును గొని,
యెటుల భుజియింతు రీ భువి నిద్ధ చరిత? 1-59-13
 
క్షత్రియుఁడగు విశ్వామిత్రు సామము విని
నట్టి బ్రాహ్మణుండ్రైనఁ, జండాలభోజ
నమును భుజియించి, స్వర్గమ్మునకును నెట్లు
పోవఁగలవార లో యయ్య, పుణ్య చరిత? 1-59-14
 
ఓ మునిశ్రేష్ఠ! యిటుల మహోదయుండు,
నటులె వాసిష్ఠు లమిత కోపారుణ నయ
నములు గలవారలై, నిష్ఠురముగల వచ
నములతోఁ బల్కిరయ్య సద్విమల చరిత!” 1-59-15
 
అనిన వారి మాటలు విని, యా ముని వృష
భుండు నౌ కౌశికుఁడు క్రోధ పూర్ణ రక్త
లోచనుండయి యప్పుడు రోషమునను
పరుషవాక్యాలఁ బల్కె నత్తరుణమందు! 1-59-16
 
ఉగ్ర తపమాచరించిన యుత్తముఁడ, న
దుష్టునగు న న్నెవారలు దూషణమ్ము
సేసిరో, యా కుజనులు భస్మీకృతులయి
పోదు రన, సంశయమ్మేలఁ? బొసఁగు నిదియె! 1-59-17
 
వార లీ నాఁడె యమపాశ బద్ధులునయి,
వెసను వైవస్వతక్షయ పీడనఁ గొని,
సప్తశతజన్మముల దాఁక సడలని గతి
నూని శవభక్షకులుగాను నుండ్రు గాక! 1-59-18
 
అటులె వాసిష్ఠు లంద ఱక్కటిక లేని
ముష్టికా జాతి యందునఁ బుట్టి, శునక
మాంస మెపుడును భుజియించు శంస గలిగి,
వికృతరూప విరూపులై పృథివి మనుత! 1-59-19
 
దూషణము సేయఁ దగని నన్ దూషణ మిడి
నట్టి దుర్హృదుఁడు మహోదయాఖ్యుఁ డిపుడు
సకల జనులును దూషించు జాతియగు ని
షాద జాతినిం బుట్టుట జరుగుఁగాక! 1-50-20
 
నాదు క్రోధంపుఁ బ్రతిగ మహోదయుండు
నెపుడుఁ బ్రాణాతిపాత సన్నిరతుఁడగుచు,
నిర్దయుఁడునయి, చిరకాల నియతిదాఁక
దుర్గతినిఁ బొందు జీవికం దొడరుఁగాక!” 1-59-21
 
ఇంత మాత్రము వల్కియు నింక నోపఁ
జాలకయె విరమించెను సరభసమున,
మహిత తాపసి, తేజస్వి, మౌని యైన
కౌశికుఁడు తాపసుల మధ్య గతుఁడు నగుచు! 1-59-22
 
[ఇది వాల్మీకి విరచిత ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమ్మునకుఁ దెనుఁగు పద్యానువాదమగు మధుర రామాయణములోని బాలకాండ మందలి యేఁబది తొమ్మిదవ సర్గ సమాప్తము]

స్వస్తి


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి