5, జనవరి 2020, ఆదివారం

మధుర రామాయణము: అయోధ్యా కాండము - 90వ సర్గము

మధుర రామాయణము
అయోధ్యా కాండము - 90వ సర్గము

సంబంధిత చిత్రం 

(భరతుఁడు భరద్వాజమహర్షినిఁ గలిసికొని సంభాషించుట. తన ఆశ్రమమున వసింపుమని భరద్వాజుఁ డాదేశించుట)

ఒడయఁడగు భరతుం డప్పు డొక్క కోసు
దవున నుండియే కని భరద్వాజు గృహముఁ,
దన బలముల నన్నింటి నటనె నిలిపెను;
నా భరద్వాజు పైఁగల యాదరమున! 2-90-1

పిదపఁ బాదచారియునయ్యు; విడిచియుఁ దన
శస్త్రముల, భృత్యులను; పట్టువస్త్రములనుఁ
తొడిగియుఁ; బురోహితుఁడు వసిష్ఠుఁడు మునుకొన;
మంత్రియుతుఁడయి మున్యాశ్రమమున కేఁగె! 2-90-2

పిదప నా భరతుఁడు, తపస్వియ కనఁబడ,
దూరమున మంత్రులను నిల్పి, తొందరించి,
యనుపురోహితుఁడయ్యును నాశ్రమమున
కేఁగె వినయమ్ము, భక్తి రేకెత్తఁగాను! 2-90-3

ఆ జటిలపుంగవుఁడు భరద్వాజుఁ డప్పు
డా వసిష్ఠునిఁ గనియు ”నర్ఘ్యమ్ము వేగ
తెం” డనుచు శిష్యులకుఁ జెప్పి, తెప్పదెరల
నాసనమునుండి లేచెఁ దా నాదరమున! 2-90-4

తన్మహాఘృణిమణి భరద్వాజముని వ
సిష్ఠునకు నెదురేఁగి, తాఁ జేమొగిడ్చి,
భరతుఁ డెరఁగఁగ, దశరథు వరసుతునిగఁ
దెలిసికొనియెను బఱపియు దివ్యదృష్టి! 2-90-5

పరమ ధర్మజ్ఞుఁడౌ భరద్వాజుఁ డంతఁ
గ్రమముగా నర్ఘ్యపాద్యమ్ములను, ఫలముల
నొసఁగి, “మీ కులమ్మందున నున్నయట్టి
యందఱుం గుశలమె?” యంచు నడిగె నపుడు! 2-90-6

“ఆ యయోధ్యానగరము, సైన్యమ్ము, బొక్క
సమ్ము, మీ మిత్ర మంత్రి సంస్త్యాయమంత
కుశలమే?” యని పృచ్ఛించి, దశరథుని మ
రణ మెఱిఁగినవాఁడైన కారణముచేత,
దశరథునిఁగూర్చి యడుగఁడు కుశలములను! 2-90-7

“ఆర్య! మీ శరీరమ్మున, కగ్నులకును,
వృక్షములకును, సచ్ఛిష్యబృందమునకు
దబ్బఱ లవేవి లేవు గదా!” యటంచు
ననె వసిష్ఠర్షి భరత ద్వయమ్ము మునిని! 2-90-8

ఆ జటిలవృషభుఁడు భరద్వాజుఁ “డార్య!
యిచట మేమంత కుశల” మనుచుఁ బలికియు,
రాఘవస్నేహబంధపురస్కృతముగ
భరతునిం గూర్చి యిట్టు లప్పట్టున ననె! 2-90-9

“భరత! రాజ్యపాలన సేయువాఁడవైన
నీ విచటి కేల వచ్చితి? నీదు విషయ
మంతయునుఁ బూర్తిగాఁ జెప్పుమయ్య! నాకు
మనము నందున నెదొ యనుమాన మొదవె! 2-90-10

విమతసంహారి, యానందవృద్ధికరుఁడు
నైన యెవనిఁ గౌసల్య నీళ్ళాడి కనెనొ?
నాతి యుసిగొల్పఁ బిత పదునాలుగేండ్లు
వనికి ససతీ సజాతు నెవ్వని ననిపెనొ? 2-90-11

ఆ మహాయశశ్శాలియునైన రాముఁ
డెదురు సెప్పక, వనమున కేఁగ; నట్టి
పాపరహితుని విషయాన, భ్రాతృవిషయ
మున, నిరాటంక రాజ్యభోక్తునిగ మార్చు
పాపమున కూనవుగదయ్య భరత నీవు?" 2-90-12

అను భరద్వాజు వాక్కుల నపుడు వినిన
భరతుఁ డట నశ్రుపూరితాంబకుఁడునయ్యు
గద్గదస్వరమునఁ దాను ఘనుఁడగు ముని
యౌ భరద్వాజు మ్రోలను ననియె నిట్లు. 2-90-13

“ఆర్య! ననుఁ గూర్చి మీ రిప్పు డాడినట్టి
పలుకులం గూర్చి తలఁపఁ, జంపంగఁబడిన
వాఁడ నయి తేను! కనఁగ నా వైపు దోష
మెదియు లే! దనఁదగదు మీ రిట్టుల నను! 2-90-14

ఏను లేనప్డు నా జనయిత్రియు వచి
యించినట్టి మాటలు నా కనిష్టములయ!
వానిచే నేను సంతోషపడఁగనైతి!
కాన, నదియె యంగీకృతి కాదు నాకు! 2-90-15

నే నరవ్యాఘ్రుఁడౌ రామునిం బ్రసన్నుఁ
జేసికొనఁ బూని, మిక్కిలి శీఘ్రముగ న
యోధ్యకుం దీసికొనిపోవ నూని, యతని
పాదపద్మమ్ములకు మ్రొక్క వచ్చితినయ! 2-90-16

ఓ మహాత్మ! యీ దుస్స్థితి నున్నయట్టు
లరసి, నా పయిఁ గృపసేసి, యవనిపుఁడగు
రాముఁ డెట మనుచుండెనో, రయముగాను
నాకుఁ దెలుపుమ యీడేఱ నాదు కాంక్ష!" 2-90-17

అనఁగ నటులె వసిష్ఠాది యాజ్ఞికులును
ప్రార్థనము సేయఁగా, భరద్వాజుఁ డపుడు
తోషమందియు, భరతునితోడ నపుడు,
స్మితవదనుఁడయ్యు నిట్లనె శీఘ్రముగను! 2-90-18

“ఓ నృపవర! గురువుచెంత నున్నయపుడు
సత్ప్రవర్తన, దమమును, సత్పురుషుల
ననుసరించుట రఘువంశమందుఁ బుట్టి
నట్టి నీకునుం దగియుండెనయ్య మిగుల! 2-90-19

నీ మదిని నున్న భావముం దెలిసికొంటి!
నయినఁ దద్విషయమ్మును నరయుటకును,
నీదు కీర్తిని వృద్ధిపొందించుటకును
నేను నిన్నిట్టులుగనుఁ బ్రశ్నించితినయ! 2-90-20

ధర్మవిదుఁడు శ్రీరాముండు తనదు గృహిణి
యైన సీతతోఁ, దమ్ముండునైనయట్టి
లక్ష్మణునితోడ, వసుధాధరమగు చిత్ర
కూటపు సమీపమందు నెక్కొనియునుండె! 2-90-21

ఎల్లి నీ వేఁగఁగా నొప్పు నీ నగవర
మునకు! నేఁడు సచివయుతమ్ముగను నుండు
మయ్య సుప్రాజ్ఞ, యిచట కామార్థకోవి
ద! యిదె నా కాంక్షితముఁ దీర్చెదవె యశస్వి? 2-90-22

అ ప్డుదారదర్శనుఁడైన యా భరతుఁడు
చాలఁగా సంతసించియు, సరభసమున
“నట్లె యగుఁగాక!” యంచును ననియు, ’రాత్రి
యాశ్రమమున వసింపఁగనగు’ నటంచు
నిశ్చయించె నృపసుతుండు నిశ్చలమతి! 2-90-23


[ఇది వాల్మీకి విరచిత ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమ్మునకుఁ దెనుఁగు పద్యానువాదమగు మధుర రామాయణములోని అయోధ్యాకాండ మందలి తొంబదవ సర్గము సమాప్తము]

స్వస్తి


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి