5, జనవరి 2020, ఆదివారం

మధుర రామాయణము: యుద్ధ కాండము – 30వ సర్గము

మధుర రామాయణము
యుద్ధ కాండము – 30వ సర్గము
సంబంధిత చిత్రం

[శార్దూలుఁడు వానరసైన్యములో నున్న ప్రముఖ వీరులను గూర్చి రావణునకుఁ జెప్పుట]

పిదప నా గూఢచారులు “నదవదపడఁ
జేయ శక్యమ్ము కానట్టి సేనలు గల
రాముఁ డుండె సువేల పర్వతమునందు!”
ననుచుఁ దెలిపిరి రావణునకు నెళవును! 6-30-1

అమిత బలశాలి శ్రీరాముఁ డచటి కేఁగు
దెంచియుండెనటంచును దెలుపఁగాను
రావణునకునుఁ గొలఁది సంత్రాస మొదవఁ
దుదకు నిటుల శార్దూలునితోడఁబలికె! 6-30-2

“ఓయి శార్దూల! నీ మేని ఛాయ ప్రాకృ
తముగ లేదు! దీనుఁడవయి మముఁ గనుచును
నుంటి! వాగ్రహించినయట్టి కంటకులకు
వశము కాలేదు కద నీవు వ్యసనమంది?" 6-30-3

అనుచు దశకంఠుఁ డిట్టుల నడుగఁగాను,
భయముచే విహ్వలుండయి, వడఁకుచు నట
నపుడు రాక్షసశ్రేష్ఠుని యందికను మృ
దువుగఁ దాఁ బల్కె నిట్లు శార్దూలుఁడు వెస! 6-30-4

“రాజ! బలవంతు, లతిపరాక్రమ సువిక్ర
ములయి, రాముని రక్షణముననునున్న
వానరశ్రేష్ఠులఁ, దమ గుప్తచరుల వెర
వునఁ బరీక్షింప సాధ్యమవునె కనంగ? 6-30-5

వారితో మాటలాడంగ వశము కాదు!
వారిఁ బ్రశ్నించు వ్యవధియుం బరఁగ లేదు!
పర్వతాకారులైనట్టి వానరు లటఁ
బుంతలన్నింటి నన్నివైపులను రక్ష
సేయుచుండిరి, రాముని క్షేమ మెంచి! 6-30-6

నేను సేనఁ బ్రవేశింపఁగానె, యింక
సైన్యముం బరీక్షింపంగఁ జనక మున్న,
నన్ను వారలు గుర్తించినారు! నీ య
నుజు విభీషణు సచివులును నను బలిమిఁ
బట్టియుఁ బరీక్ష సేసిరి బహువిధముల! 6-30-7

క్రోధమున నన్ను వానరుల్ గుప్పిళులనుఁ,
బండ్ల, మోకాళ్ళఁ, జేతుల బలము కొలఁది
తాగడించియు, సైన్యమధ్యమున వెసను
నన్ను నూరేఁగఁజేసిరి నగియుఁ దెగడి! 6-30-8

క్షతజదిగ్ధసర్వాంగుఁ, ద్వగాది విచలి
తేంద్రియుండనౌ నన్నుఁ ద్రిప్పించి, రాఘ
వుని సభకుఁ దమవెంటఁ గొంపోయి, యతని
యెదుట నుండంగఁజేసిరి హేయముగను! 6-30-9

ఇట్లు వానరుల్ నన్నుఁ బీడించుచుండఁ
గాను నే నంజలించి, రాఘవుని చేతఁ
బ్రాపొసంగఁగఁబడి, దైవవశము చేతఁ
బ్రాణములఁ దాల్చియుంటి నిర్భయుఁడనయ్యు! 6-30-10

ఇట్టి రాముండు ప్రచుర గిరీంద్రములను,
శిలలఁ బడవేసి, వారిరాశిని నినిచియుఁ,
జేత నాయుధమ్ములఁ దాల్చి స్థిరముగాను
లంక వాకిట నిల్చెఁ దా రమణమీఱ! 6-30-11

వేగ రాముండు నన్నును విడిచిపెట్టి,
గరుడ రచనమ్ము నిర్మించి, కపి పరివృతుఁ
డగుచు, వెంబడించుచు వార లరుగుదేఱ,
లంక దెస కాగమించెను ప్రకటముగను! 6-30-12

రాముఁ డిచ్చటకుం జేరి, ప్రహరి దాటు
లోపునను నీవ సత్కార్య మోపి, వేగ
సీత నొసఁగుటో, యుద్ధమ్ముఁ జేయుటొ యొక
టెద్దియైన నొనర్పుము హితకరముగ!" 6-30-13

అనిన శార్దూలు వాక్యమ్ము వినియు నసుర
రాజు రావణుం డది యంతరంగమందు
నూహ సేసియు, నచ్చట నొదవినట్టి
తత్స్థితిని నిట్టు లతనితోఁ దడవుచు ననె! 6-30-14

“దేవగంధర్వదానవాది గణము లొక
టిగను మాఱి, నా పయిని దాడికి దిగినను,
సకల లోకమ్ములును నన్ను జడియఁజేసి
నను, నెదియు నేమయినను సీతను నొసఁగను!” 6-30-15

అనుచు మహితతేజశ్శాలియౌ దశాన
నుఁడు వలికి, “నీ వడవితిరుగుడుల బలము
నటఁ బరీక్షించితివి కద! యా బలమున
శూరులైన వాండ్ర నెఱిఁగించు” మని, మఱియు. 6-30-16

“సౌమ్య! సువ్రతా! యెదిరింప సంభవమ్ము
కాని యే వానరులు నందుఁ గలరొ, వార
లెట్టి కాంతియుఁ గలవారొ, యట్టివార
లెవని పుత్రులుం బౌత్రులో, యిఁకఁ దెలుపుము! 6-30-17

వారల బలాబలమ్ములుఁ బట్టుబడిన,
ముందు నేది కర్తవ్యమో పొసఁగఁ దెలియు!
ననికి నేతెంచినట్టివానిని గుఱుతిడి,
సరకు సేయంగనగుఁ గాదె ససిగ మనము!" 6-30-18

అనిన రావణు మాటల వినిన యుత్త
మ చరుఁడైన శార్దూలుండు మానమంది
రుఁడగు రావణాసురుని చేరువను నిట్లు
చెప్పుటకును నారంభించె స్థిరముగాను! 6-30-19

“అతఁడు సుగ్రీవుఁడను వానరాధిపుండు!
ఋక్షరజసుని పుత్రుండు! నెట్టి యుద్ధ
మందయిన నెదిరింప శక్యమ్ము కాని
బలుఁడు! నీతఁడు గద్గదు స్వజుఁడు! జాంబ
వంతుఁడనువాఁడు! విస్తృత బలయుతుండు! 6-30-20

ఇంక నీతఁడు గద్గదు నితర సుతుఁడు!
ధూమ్ర నాముండు! నీతండు ద్యుపతికి గురు
వౌ బృహస్పతి తనయుఁడై పరఁగు కేస
రి యనువాఁడు! దైతేయహారియగు నాంజ
నేయు జనకుండు, వీరుండు, హితకరుండు! 6-30-21

రాజ! యీతండు యమధర్మరాట్సుతుండు,
వీరుఁడును, ధర్మసత్పాదవిక సుషేణ
నాముఁ! డీతండు చంద్రుని నందనుండు,
దధిముఖాఖ్య సౌమ్యుఁడగు కుథాకువయ్య! 6-30-22

వీర లా బ్రహ్మ వానర ప్రేరిత ముఖుఁ
డగుచు సృజియించిన యసహాయాగ్రగులు సు
ముఖుఁడు, వేగదర్శి మఱి దుర్ముఖుఁడు! వీరు
వానరాకృత మృత్యువై వఱలుచుంద్రు! 6-30-23

అగ్నిపుత్రుండు తానె సేనాధిపతిగ
నీలుఁడను నామమున నిట నిలిచియుండె!
నటులె హనుమంతుఁ డనుపేర నమిత కీర్తి
నందినట్టి వాయుసుతుండు నడరుచుండె! 6-30-24

శక్ర పౌత్రుండు, నెదిరింప సాధ్యపడని
బలుఁడు, యువకుఁ, డంగదుఁ డిటు ప్రక్క నుండ,
దేవభిషజస్వజుల్ మైంద ద్వివిదులు నటు
ప్రక్కనుండిరి శత్రునిర్వాణులగుచు! 6-30-25

శరభ, గంధమాదన, గవాక్ష, గవయ, గజు
లనెడి పంచసంఖ్యాకులు యముని సుతులు
మృత్యుదేవతా సములయ్య! మృథమునకయి
యుత్సహించెడి వానరయోధు లుండ,
నింక మిగులు దేవ సుతుల నెన్నఁజాల! 6-30-26

ఘనుఁడు, యువకుండు, సింహ సంహననుఁడు, దశ
రథుని నందనుండును, త్రిశిర ఖర దూష
ణాది దనుజ నాశకుఁడును నైనయట్టి
రామచంద్రునిఁ గంటివే రాక్షసేంద్ర? 6-30-27

అల విరాధుని, యమ సముఁ డగు కబంధు
నిహతుఁ జేసిన శ్రీరాముని సముఁడయిన
శౌర్యయుతుఁ డీ త్రిజగములఁ జాల వెదుకఁ
గనఁగనౌనె యెచ్చటనైన దనుజవర్య? 6-30-28

ఈ జనస్థానముననున్న యెందఱొ దను
జులనుఁ జంపిన రాముని సుగుణములనుఁ
ససిగ వర్ణింపఁగలుగు ప్రశస్త పురుషుఁ
డీ త్రిలోకాల నుండెనే యెంచిచూడ? 6-30-29

ఎవని బాణాధ్వముననున్న యింద్రుఁడు సహి
తమ్ము జీవింపఁజాలఁడో తలఁప, నట్టి
ధార్మికుండు, వరగజ విధమున నున్న
లక్ష్మణుం డిట నుండెను లక్షణముగ! 6-30-30

షట్పాది:
వీతిహోత్రుని తనయులు శ్వేతుఁడు మఱి
యును ఘనుఁడగు జ్యోతిర్ముఖుండును; వరుణుని
సుతుఁడు హేమకూటుం; డట్లె చూడ విశ్వ
కర్మ సుతుఁడును, వానర ఘనుఁడు, వీరుఁ
డయిన నీలుండు; వసువుల యాత్మజుఁడును,
శీఘ్రగామి, దుర్ధరుఁ డిట స్థిరత నుండె! 6-30-31

అటులె దనుజ వర్యుండు, నీ యనుజుఁ డయిన
యల విభీషణుం, డట రాఘవాభ్యుదయము
వలచియును, లంకఁ దాఁ గొనఁ, బరివృతుఁడయి
నిలిచియున్నాఁడు దనుజేంద్ర నీతిఁ దప్పి! 6-30-32

ఆ సువేల పర్వతమందు నలరుచున్న
యట్టి వానర సేనా రహస్యములను
నీకుఁ దెల్పితి! నిఁకపైన నీవ యేమి
చేయవలెనొ యోచింపుము స్థిరత నధిప!” 6-30-33


[ఇది వాల్మీకి విరచిత ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమ్మునకుఁ దెనుఁగు పద్యానువాదమగు మధుర రామాయణములోని యుద్ధ కాండ మందలి ముప్పదియవ సర్గము సమాప్తము]

స్వస్తి


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి