5, జనవరి 2020, ఆదివారం

మధుర రామాయణము : ఉత్తరకాండము - 13వ సర్గము

మధుర రామాయణము
ఉత్తరకాండము - 13వ సర్గము


[రావణుఁడు నిర్మింపఁజేసిన శయనగృహమునఁ గుంభకర్ణుఁడు శయనించుట, రావణుని దురాగతములు, కుబేరుఁడు దూతనుఁ బంపి, రావణున కుపదేశమొనరించుట, రావణుం డా దూతను చంపించుట]

అనె నగస్త్యుఁడు రామున కపుడు "రామ!
పిదప నొక కొంత కాలాన వేధ ప్రేరి
తమగు తీవ్ర నిద్రయ యప్డు తన మహిమను,
జృంభ రూపాదులనుఁ గొని, చేరి, కుంభ
కర్ణు నావహించెను తమకమున మిగుల! 7-13-1

అంతఁ గుంభకర్ణుఁడు చని, యాసనమునఁ
గూరుచొనియున్న నగ్రజుఁ గూర్చి "రాజ!
నన్నుఁ బెను నిద్ర బాధించుచున్నదయ్య!
శయన గృహమును గట్టించుమయ!" యనియెను; 7-13-2

అనినయంతనె రావణుం డాజ్ఞ నిడఁగ,
విశ్వకర్మనుఁ బోలు శిల్పిగమి, యొక్క
యోజనమునకును ద్విగుణ యోజనముల
పొడవు వెడలుపు లున్నట్టి, పొలుపు మీఱు
ఘన గృహముఁ గట్టి, యిడెఁ గుంభకర్ణునకును! 7-13-3

స్ఫటిక కాంచన చిత్రిత స్తంభ ఘటిత
భాసితమ్ము, వైడూర్య సోపాన కృతము,
శింజినీ జాలకము, దాంత శిల్ప తోర
ణాన్వితమ్ము, వజ్రస్ఫటికాంచితంపు
టరుఁగు లలరె సుఖద మనోహర గృహమున! 7-13-4

మేరుపుణ్యగుహక్రియన్ మెఱయునట్టి
సకల సుఖకరమైన వేశ్మమ్మున నతి
బలుఁడు కుంభకర్ణుఁడు చేరి, బహు సహస్ర
వత్సరములు శయించి, తెర్వఁడయ కనులు! 7-13-5

కుంభకర్ణుఁ డా విధి నిద్రఁ గూఱియుండ,
నిచటఁ బౌలస్త్యుఁ డాపఁగ నెవరు లేక,
దేవమునియక్షగంధర్వదృఘువులపయిఁ
బడియుఁ బీడించె, దయలేనివాఁడునయ్యు! 7-13-6

అమిత కోపాన్వితుఁడయి దశాననుండు
నందనాదివిచిత్రవనమ్ములకును
జనియు, నన్నింటిఁ గూల్చెను జాలిలేక!
కోపమున్నట్టివారల నాపఁ దరమె? 7-13-7

నదుల యందునఁ గ్రీడించు నాగము వలె,
వర కుజమ్ములఁ బెకలించు వాయువు వలెఁ,
బర్వతముల ఱెక్కలఁ ద్రుంచు పవినిఁ బోలె,
దనుజుఁ డా రావణుఁడు వన ధ్వంసి యాయె! 7-13-8

పంక్తికంఠుఁ డిట్లొనరుచు వార్త లెఱిఁగి,
యనుఁగుఁ దమ్మునిం గాంచు వంకనుఁ గొనియును,
ధనదుఁడౌ కుబేరుఁడు వంశ ధర్మనిరతి
దృష్టి నిడికొనియు, హితోపదేశమిడఁగ,
నతని లంకకు నొక దూత నంపె నపుడు! 7-13-9

ఆతఁ డట్టు లా లంకకు నరిగి, చన వి
భీషణుని గృహమ్మునకునుం, బ్రేమఁ జూపి,
యతని కాతిథ్య మిడి, వాని యాగతి వినఁ
బృచ్ఛసేసె విభీషణుం డిచ్చతోడ! 7-13-10

ధనదు క్షేమమ్ము నడిగి, యాతని స్వజనుల
నరసియు విభీషణుం డంత, నచట సభను
నగ్ర సింహాసనాసీనుఁ డగ్రజుఁ డగు
రావణుం జూపె దూతకుఁ బ్రమదమునను! 7-13-11

అచట స్వీయ తేజమ్ముతో నడరుచున్న
ప్రభుని రావణుం గని, జయధ్వానములనుఁ
దగు విధమ్మునఁ గీర్తించి, ధనదు దూత,
యుక్తి యుక్తుఁడు, క్షణకాల మూరకుండె! 7-13-12

అటు పయిని రాయబారి, వరాస్తరణ వి
శోభితోత్తమపర్యంకసుఖవిలాసుఁ
డైన రావణు, దశకంఠు, నసుర నృపునిఁ
గూర్చి యిట్టుల వచియించెఁ గూర్మిమీఱ! 7-13-13

"క్షితిప! మీ సోదరుఁడు వచించిన విషయము
నంతయును వచించెదనయ్య హర్ష మెసఁగ!
వీర! యిదియ మీ యుభయ సద్వృత్త వంశ
ములకు ననురూపమైనది పూర్ణముగను! 7-13-14

"సోదరా! యింతవరకీవు చూపినట్టి
ఘన కృతము లింకఁ జాలును! కంటిఁ దృప్తి!
నీకు సాధ్యమ్మె యైనచో, నీదు బుద్ధి,
ధర్మమార్గమ్మునకుఁ ద్రిప్పఁ దగును వత్స! 7-13-15

భగ్ననందనవనదృశ్యపంక్తిఁగంటి!
నీవు ఋషులఁ జంపించిన కృతము వింటి!
రాజ! నినుఁ గూల్పనున్న గీర్వాణ యత్న
మంతయును వింటి వత్స, నే నింత దాఁక! 7-13-16

ఈవు నను నిరాకృతుఁ జేసి తెన్నొమార్లు!
కాని, నిను బాలుఁ డని యెంచి, కనఁగనైతి!
బాలుఁ డపరాధముం జేయ, బందుగులును,
వానిఁ గావంగఁ దగుఁ గాదె, పలువిధముల? 7-13-17

ఇదే భావమున మఱియొక పద్యము:
[ ఏలిదమ్ముగఁ జూచితి చాలఁగ నను;
దాని సైఁచితిఁ జుమి నీవుఁ దమ్ముఁ డగుడు!
బాలుఁ డిల దుడుకైనను బంధుతతికిఁ
బాలనము సేఁత నీతియౌఁ బలువిధముల! ]

ధర్మసంసేవనము మదిఁ దలఁచి, వలచి,
నేను రౌద్రవ్రతమ్మును నిష్ఠతోడఁ
జేయఁగను జితేంద్రియుఁడనై, శీఘ్రగతిని
హిమనగోపరిసీమల కేఁగితినయ! 7-13-18

అచటఁ బార్వతీ సహితుఁడౌ నాదిదేవు
దర్శనము సేయ, నప్రయత్నముగ నపుడు,
నా యెడమ కంటి దృష్టియే, యా యమ పయిఁ
బడఁగ, హతవిధీ! దొసఁగునఁ బడితినయ్య! 7-13-19

ఇదే భావమున మఱియొక పద్యము:
[ అచటఁ బార్వతీ సహితుఁడౌ నాదిదేవు
దర్శనము సేసికొనుచుండ, దైవవశము
చేత, నా సవ్యదృ, క్కయ్యొ! చెలఁగి, పడియె
నచటి పార్వతీ దేవిపై నచ్చెరువున! ]

ఈమె యెవరను సందేహ మెసఁగు కతన,
నేనుఁ జూచితిఁ గాని, యింకేమి గాదు!
కనఁగ, సాటి లేనట్టిదౌ కమ్రరూప
మంది, పార్వతీ దేవియే యచట నుండె! 7-13-20

గౌరి దివ్యప్రభావంపుఁ గారణమున,
నాదు సవ్యేక్షణ మ్మప్డు బూది యయ్యుఁ,
బాంసుకణహతనయనమ్ముభాతిఁ గమరి,
పింగళపు వర్ణముం దాల్చె వేగముగను! 7-13-21

పిదప నే హిమగిరితటవిస్తృతంపు
టన్యదేశమ్మునకు నేఁగి, హరునిఁగూర్చి
యష్టశతవర్షమౌనతపోఽధికమునుఁ
జేసితిని భక్తి నిండార స్థిరముగాను! 7-13-22

ఇదే భావమున మఱియొక పద్యము:
[కాన, తద్గిరి నన్యశృంగమ్ముఁజేరి,
యచట భక్తి దైవారఁగ హరునిఁగూర్చి,
నూటయెనిమిదియేఁడులు గాటమైన
మౌనతపముఁ జేసితి నే ననూనముగను! ]

తన్మహేశ్వరవ్రతసమాప్తమ్మునందు
దేవదేవుఁ డానంద మందియును మదిని
వత్సలత ప్రకాశింపఁగా, వరమిడఁగను,
నన్నుఁ గూర్చియుఁ బ్రేమతో ననియె నిట్లు! 7-13-23

"ధర్మవిద! సువ్రత! కుబేర! ధనద! నీదు
ఘనతపమ్మునకునుఁ బ్రీతుఁడ నయితినయ!
యిట్టి వ్రతమును మొదటగా నేను సలిపి
తిని! యిపుడు నీవు నొనరించితివయ భువిని! 7-13-24

ఇట్టి వ్రత మొనర్పఁగ సమకట్టినట్టి
తొట్టతొలి పురుషుఁడ నేన! యిట్టిదాని
నాచరించిన రెండవ వ్యక్తి వీవ!
యిద్దఱమె! తృతీయుండు లేఁ డిలను! నిట్టి
దుష్కరవ్రతసృష్టికాద్యుఁడను నేనె! 7-13-25

ఇదే భావమున మఱియొక పద్యము:
[ ఇట్టి వ్రతమొనర్పఁగ సమకట్టినట్టి
తొట్టతొలి పురుషుఁడ నేన! తుట్టతుదిని,
రెట్టి వీవె! తృతీయుండు లేఁడు! ప్రథమ
దుష్కరవ్రతసృష్టికాద్యుఁడను నేనె! ]

అందుచే, నాదు సఖ్యమ్ము నందుకొనఁగఁ
దెలుపు మంగీకృతమ్ము, విత్తేశ! నీవు!
తపముచేతను నను గెల్చి, తనరుచుంటి!
కాన, ధనదుఁడ! నా చెలికాఁడవగుమ! 7-13-26

దేవి మహిమచే డాఁపలి దృక్కు కాలె
నెటులొ? దేవిఁ గాంచిన నేత్ర మెటులొ యిట్టి
పింగళపువర్ణమందె? నా భంగి నీకు
నలర "నేకాక్షిపింగళి" యనెడి నామ
మొదవు నీ భువిన్ శాశ్వతమ్ముగను, ధనద! 7-13-27

ఇటుల శంకరు స్నేహమ్ము నెసఁగ నంది,
యతని యాజ్ఞనుఁ బొందియు నాదృతిఁగొని,
తిరిగివచ్చిన నేనిట విరివిగాను
నీదు పాప కార్యములు వింటినయ వత్స! 7-13-28

కాన, కులమున కపకీర్తిఁ గలుగఁజేయు
నట్టి ధర్మవిరహితకృత్యములనుండి
మఱలుమయ్య! దేవర్షి సంహతియు నీదు
మారణోపాయమును రచింపంగనుండ్రి!" 7-13-29

అనఁగ విన్నట్టి రావణుం డాగ్రహకృత
రక్తలోచనుఁడై, హస్త రదనములను
మిగులఁ బీడితముం జేసి, మేఘగర్జ
వోలె నిట్టుల వదరెను పొగరు గదుర! 7-13-30

"దూత! నీవేమి యిటఁ బల్కితో తెలిసెను!
పలికినట్టి నీ వింకను బ్రతుకఁబోవు!
పలుకఁ బ్రేరేచినట్టి నా భ్రాత కూడ
బ్రతుకఁబోడయ్య! సత్యంపు వచనమిదియ! 7-13-31

ఆ కుబేరుని హితము నా కహిత! మీవు
మూఢుఁ డైనట్టి యాతఁడుఁ బొందినటుల
వినుచు "శివసఖిత్వ" మ్మది వినఁగ నాకు
నిఁక క్షమార్హమ్ము కాదోయి! హేయమోయి! 7-13-32

దూత! నే నింత దాఁకనుఁ దోడఁబుట్టు
వైన ద్రవిణేశు సహియించితయ్య! యతఁడు
నాకు నగ్రజుం డౌటచే "నన్నుఁ జంపఁ"
డనుకొనుచునుండె నో దూత! యదియ తప్పు! 7-13-33

వాని మాటలు నీదు ముఖాన వినిన
పిదప, మద్బాహువిక్రమ విపుల బల ప
రాక్రమములచే లోకత్రయాక్రమణముఁ
జేయవలెనని నిశ్చయించితిని నేఁడు! 7-13-34

ఆ ధనదుఁ డిట్లు పల్కించి నందువలన
నేనె, యీ క్షణమందుననే ధనదుని,
నతనితోఁ బాటుగా నల్వురైన లోక
పాలురనుఁ గూడ వధియింతు వైళమ యిఁక!" 7-13-35

అనుచు రావణుం డిటులు వల్కిన తదుపరి,
నిశిత ఖడ్గాన దూతను నిహతుఁ జేసి,
దుష్ట రాక్షస తతులకు నిష్టమైన
యామిషమ్మును భక్షింప నందఁజేసె! 7-13-36

అంతఁ బౌలస్త్యుఁ డప్డు స్వస్త్యయనుఁడయ్యు
వేగమే రథారూఢుఁడై వెడలె, మదినిఁ
గనుచుఁ ద్రైలోక్య విజయ లక్ష్యంపుఁ గాంక్ష,
ధనదుఁ డున్నట్టి దెసకు సంతస మెసంగ!"
నని యగస్త్యుఁడు రామునకు నిటు తెలిపె! 7-13-37


[ఇది వాల్మీకి విరచిత ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమ్మునకుఁ దెనుఁగు పద్యానువాదమగు మధుర రామాయణములోని యుత్తరకాండ మందలి త్రయోదశ సర్గ సమాప్తము]

స్వస్తి


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి